మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దిపావళి ఆస్థానం

venkateswara swamy
దీపావళి పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. ఆలయ అర్చకులు, తిరుమల జీయర్లు, తితిదే ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి వద్ద ఆగమోక్తంగా ఈ ఆస్థాన వేడుకలను నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆలయ ఈవో జె.శ్యామలరావు మాట్లాడారు. శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు.
 
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీవేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ, భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని ఆకాంక్షిస్తూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్టుకి, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు అలంకరించినట్లు చెప్పారు. 
 
తొలుత ఆలయంలో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు. 
 
ఈ ఆస్థాన కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు, ముఖ్య అర్చకుడు కిరణ్ స్వామి, అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్పీ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, పారు పత్తేదార్ బాల సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.