గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (09:34 IST)

నేటి నుంచి కరోనా ఆంక్షల మధ్య హరిద్వార్ కుంభమేళ

హిందూ సంప్రదాయం మేరకు అత్యంత పవిత్రమైన క్రతువుగా భావించే వాటిలో కుంభమేళా ఒకటి. ఈ ఆధ్యాత్మిక వేడకకు దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అలాగే, ఈ యేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హరిద్వార్‌లో కుంభమేళా జరుగుతుంది. 
 
ఈ కుంభమేళాకు హాజరయ్యే భక్తులకు అక్కడ ప్రభుత్వం కొన్ని నిబంధనలను పెట్టింది. యాత్రికులు తప్పనిసరిగా ఆర్టిపిసిఆర్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకునిరావాల్సిందిగా సూచించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ వేడుక జరుగనుంది. 
 
ఈ కుంభమేళాలో ఏప్రిల్ 12, 14 మరియు 27 తేదీలను విశిష్టంగా భావిస్తారు. హరిద్వార్ కుంభమేళా సమయంలో భక్తుల్లో గంగా స్నానం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక ప్రత్యేక రోజుల్లో భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది.
 
సాధారణంగా మహా కుంభమేళా ప్రతి 12 యేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇది మూడున్నర నెలల పాటు సాగుతుంది. అయితే మళ్ళీ కరోనా వైరస్ విజృభిస్తున్న నేపథ్యంలో కుంభమేళా వ్యవధిని తగ్గించారు. చరిత్రలో మొదటిసారిగా నెల రోజులు మాత్రమే కుంభమేళా వేడుకలను నిర్వహిస్తున్నారు. గతంలో కుంభమేళ జనవరి 14 నుండి 2010 ఏప్రిల్ 28 వరకు హరిద్వార్‌లో జరిగింది.
 
అయితే, ఈ కుంభమేళాకు వచ్చే భక్తులు విధిగా 72 గంటల లోపు నిర్వహించిన "నెగటివ్" ఆర్టీ-పిసిఆర్ పరీక్ష నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న భక్తులు తమ సర్టిఫికెట్లను అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి మార్గదర్శకాలను పాటించాల్సి ఉంది.
 
హరిద్వార్ కుంభమేళాలో మత సామరస్యం వెల్లువిరుస్తుంది. హరిద్వార్ సమీపంలోని జ్వాలాపూర్లో జరిగే భారీ ఊరేగింపులో పాల్గొనేందు వచ్చిన హిందూమత నాయకులకు, సాధు సంతలకు సంప్రదాయం ప్రకారం అంజుమన్ కాం గంథన్ పంచాయత్‌కు చెందిన ముస్లిం పెద్దలు భక్తిపూర్వకంగా దక్షిణలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు. హిందూ సోదరులు వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వారిని ఆశీర్వదిస్తారు. ఇది తరతరాలుగా ఈ సాంప్రదాయం సాగుతుంది.