మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2019 (11:27 IST)

శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదోరోజు.. మహిషాసురమర్దనిగా కనకదుర్గాదేవి

శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదోరోజు సోమవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవిని మహిషాసురమర్దనిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిషుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు జగన్మాతకు మహిషాసురమర్దని అనే పేరు ఏర్పడింది. సింహవాహనాన్ని అధిరోహించి, చేతిలో త్రిశూలం ధరించి ఉగ్రరూపంతో ఈ తల్లి దర్శనమిస్తుంది. 
 
దేవతలందరి శక్తులు ఈమెలో ఉంటాయి. గొప్పతేజస్సుతో ప్రకాశిస్తుంటుంది. ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. మహిళల్ని చిన్నచూపు చూడటం, వారిని విలాసవస్తువుగా భావించటం మొదలైన లక్షణాలకు మహిషుడు ఉదాహరణ. 
 
నేటి సమాజంలోనూ ఇలాంటి మహిషాసురులు ఎందరో ఉన్నారు. స్త్రీని ఎదగనివ్వకూడదని పనిచేసే వ్యక్తులూ ఉన్నారు.
ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఉంటూనే వాటిని ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించాలనే సందేశాన్ని మహిషాసుర మర్దనీదేవి అలంకారం మనకు అందిస్తుంది. 
 
అన్నింటా విజయం సాధించగలమనే ఆత్మస్థైర్యం మహిళలకు తప్పనిసరిగా ఉండాలి. మహిషుడు అసాధారణమైన శక్తి కలిగినవాడు. అయినా సరే... అతడిని ఒంటరిగానే ఎదుర్కొంది జగన్మాత. అవతలి వ్యక్తి శక్తిని చూసి భయపడితే విజయం ఎప్పటికీ దూరంగానే ఉంటుందనే సత్యాన్ని మహిషాసురమర్దని ఆచరణాత్మకంగా చూపిస్తుంది.
 
ఎప్పటికప్పుడు తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటూ, అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ, అవసరమైతే పరాక్రమాన్ని ప్రదర్శించటానికి అనుక్షణం సన్నద్ధంగా ఉండాలనే సందేశాన్ని మహిషాసురమర్దనీదేవి అలంకారం నుంచి అందుకోవాలి. 
 
ఎన్నో వేల సంవత్సరాల నాడే కాదు... నేటికీ మహిళ అస్తిత్వాన్ని ప్రశ్నించే మహిషాసురులు ఎందరో ఉన్నారు. మహిషుడితో తొమ్మిదిరోజుల పాటు సాగిన రణంలో రోజుకో రూపంతో యుద్ధం చేసింది అమ్మవారు.