సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (20:30 IST)

మేడారం జాతరను ఎలా నిర్వహించాలి.. తెలంగాణ అధికారుల సమాలోచనలు

భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు గుర్తింపు వుంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ యేడాది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ జాతరను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే, కరోనా వ్యాప్తి అధికంగా ఉన్ననేపథ్యంలో కోవిడ్ ఆంక్షల మధ్యే ఈ యేడాది కూడా ఈ జాతరను జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ప్రతి రెండేళ్ళకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తారు. ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కుంభమేళ తర్వాత భారీగా భక్తులు పాల్గొనే ఈ జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 
 
ఈ జాతరను చూసేందుకు ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి గిరిజన ప్రజలు తరలివస్తారు. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలాది మంది భక్తులు సమ్మక్క - సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతర భక్త జన సంద్రాన్ని తలపిస్తుంది. 
 
అయితే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికండా ఉండటంతో ఈ జాతర నిర్వహణపై అధికారులు తర్జనభర్జన చెందుతున్నారు. కోటి మందికి పైగా వచ్చే భక్తులను ఏ విధంగా కట్టడి చేయాలన్న అంశంపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ జాతరకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా 24 గంటల లోపు కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ చూపించేలా ఆంక్షలు విధించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు.