ఈ రోజు నా జీవితంలో ఒక మధురమైన రోజు- తమిళనాడు గవర్నర్
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులలో టిటిడి యాజమాన్యం కోవిడ్ -19 నిబంధనల మేరకు చేసిన దర్శన ఏర్పాట్లను తమిళనాడు గవర్నర్ శ్రీ బన్వారిలాల్ పురోహిత్ కొనియాడారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం బ్రేక్ దర్శనంలో తమిళనాడు గవర్నర్ దర్శించుకున్నారు.
అనంతరం అద్దాల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అదనపు ఈవో తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి మనిషికి జీవితంలో మహత్తరమైన రోజు ఉంటుందని, ఈ రోజు తన జీవితంలో మరపురాని రోజన్నారు.
తాను దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలను సందర్శించానని, అయితే ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుమలను సందర్శించినప్పటికీ ఇక్కడ అనుసరిస్తున్న పరిశుభ్రత, పర్యావరణం చక్కగా ఉన్నాయని ఇందుకోసం కృషి చేస్తున్న టిటిడి అధికారులు, సిబ్బంది నిబద్ధత మరియు అంకితభావాన్ని కొనియాడారు.
కోవిడ్ -19 నిబంధనల మేరకు "భక్తులకు భౌతిక దూరం మరియు ఇతర నిబంధనలతో దర్శనం, నిర్వహణ చాలా బాగా అమలు చేయబడుతుంది" అని ఆయన అభినందించారు. నాదనీరాజనం వేదికపై సుందరకాండ పఠనంలో పాల్గొన్న ఆయన తన అనుభూతిని తెలుపుతూ, "నేను హనుమంతుని భక్తుడను, ప్రతిరోజూ హనుమాన్ చలీసాను పఠిస్తాను, సుందరకాండను కూడా చాలా సందర్భాలలో పఠించినట్లు తెలిపారు.
మన హిందూ సనాతన ధర్మం, భారతదేశ సంస్కృతిని అద్భుతంగా భక్తులకు చేరవేస్తున్న సుందరకాండ పఠనం 100వ రోజు పాల్గొనడం ఒక విశేషంగా భావిస్తున్నామన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో లోక కల్యాణార్థం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలను చేపట్టి, నిర్వహిస్తున్నటిటిడిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని ఆయన అన్నారు.