సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (11:16 IST)

తితిదే బంపర్ ఆఫర్... ఆ పని చేస్తే భక్తులకు ఉచిత దర్శనం...

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా లాక్డౌన్ తర్వాత శ్రీవారి ఆలయం తెరుచుకోవడంతో కొండపైకి భక్తుల రాక కూడా పెరిగింది. అంతేకాకుండా, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ మాధ్యమంగా కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తామని ప్రకటించింది. 
 
ఇటీవల ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం సేవను టీటీడీ ప్రారంభించిన తర్వాత భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇదేసమయంలో తమకు స్వామి దర్శనం కల్పించాలని భక్తులు కోరుతుండటంతో టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, సెప్టెంబరు 7వ తేదీ వరకు మొత్తం 8,330 మంది భక్తులు ఆన్ లైన్ మాధ్యమంగా కల్యాణోత్సవాన్ని జరిపించారు. వీరందరికీ ఉత్తరీయం, రవిక, కల్యాణం అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా టీటీడీ పంపుతోంది. 
 
ఇకపై కల్యాణోత్సవం చేయించే భక్తులు, టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోగా స్వామివారి దర్శనానికి రావచ్చని, సుపథం ప్రవేశమార్గం ద్వారా వీరికి ఉచితంగా స్వామి దర్శనాన్ని కల్పిస్తామని ప్రకటించింది. 
 
ఇదిలావుండగా, తిరుమల కొండపై కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తిరుపతిలో జారీ చేస్తున్న శ్రీవారి స్లాటెడ్‌ సర్వదర్శన (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు టీటీడీ శనివారం ప్రకటించింది. ఆదివారం నుంచి ఈనెల 30వ తేది వరకు టోకెన్లు ఇవ్వబోమన్నారు. 
 
అయితే, అప్పటికే ఆదివారం నాటి టోకెన్ల కోసం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో నిరీక్షిస్తున్న భక్తులు టీటీడీ నిర్ణయంపై ఆగ్రహించారు. ఉన్నట్లుండి రద్దు నిర్ణయం ఎలా తీసుకుంటారని మండిపడ్డారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గరుడ సర్కిల్‌ వద్దకు చేరుకుని బైఠాయించారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పినా.. వారు ససేమిరా అన్నారు. వీరందరికీ ఆదివారం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 
 
తిరుపతి పట్టణంలో కరోనా కేసులు పెరగడంతో జూలైలో లాక్డౌన్‌ విధించడంతో ఈ టోకెన్ల జారీని తాత్కాలికంగా టీటీడీ రద్దు చేసింది. ప్రస్తుతం ఆంక్షల సడలింపుతో ఒకటో తేది నుంచి టోకెన్లు ఇస్తున్నారు. పెరటాసి నెల.. ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్లు లభించని వివిధ ప్రాంతాల భక్తులు ఈ టోకెన్ల కోసం ముందు రోజే తిరుపతికి చేరుకుని గుంపులుగా నిరీక్షిస్తున్నారు.
 
దీనివల్ల తిరుపతి, తిరుమలలో కొవిడ్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న భావనతో మరోసారి ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని తాత్కాలికంగా రద్దు చేసింది. భక్తుల ఆందోళన నేపథ్యంలో క్యూలోని భక్తులకు ఆదివారం ఉదయం టోకెన్లు జారీ చేసి.. ఆపై నిలిపివేశారు.