తిరుమల ఉద్యాన వనాలలో సుందరంగా ఉంచండి: ధర్మారెడ్డి
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆహ్లాదం కలిగించేలా ఉద్యానవనాలను తీర్చిదిద్దాలని టిటిడి అదనపు శ్రీ ఏవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలో ఉన్న గోకులంలోని సమావేశ మందిరంలో అధికారులతో అదనపు ఈఓ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ యంత్రాలను ఉపయోగించి ఆధునిక పద్ధతుల్లో ఉద్యానవనాల పెంపకం చేపట్టాలన్నారు. వివిధ ప్రాంతాల్లోని ఉద్యానవనాలకు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సివిల్, ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేయాలన్నారు. ఉద్యానవనాల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యే దశలో ఫౌంటెన్లు, భక్తులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అటవీ, ఉద్యానవన, ఇంజినీరింగ్ విభాగాలు, జిఎంఆర్ సంస్థ ప్రత్యేక ప్రతినిధి కలిసి ఆయా ఉద్యానవనాల్లోని సమస్యలను గుర్తించి, వాటి అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు జిఎంఆర్ సంస్థ ప్రతినిధి శ్రీ మహేందర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమలలో సుందరీకరించాల్సిన ఉద్యానవనాల గురించి వివరించారు. జిఎన్‌సి టోల్ గేట్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు పక్కన, ఏఎన్ సి, హెచ్ విసి, జిఎన్‌సి తదితర కాటేజీల మధ్య భాగంలో, నారాయణగిరి ఉద్యానవనాల్లోని పద్మావతి పరిణయ మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపల, ఆళ్వార్ తోట, ధర్మగిరి రింగ్ రోడ్డు, అన్నదానం భవనం లోపల ప్రహరీ ఉద్యానవనాలు తదితర ప్రాంతాల్లో ఉద్యానవనాలు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
అంతకుముందు టాటా సంస్థ ప్రతినిధులతో ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై అదనపు ఈఓ వర్చువల్ సమావేశం నిర్వహించారు. మ్యూజియంలో దశలవారీగా సివిల్, ఎలక్ట్రికల్ పనులు చేపట్టాలన్నారు. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి కళాకృతులు ఉంచాలనే విషయంపై చర్చించారు. సీసీటీవీ కంట్రోల్ రూమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటుపై సమీక్షించారు.