శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. పుణ్య క్షేత్రాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:22 IST)

అక్కడ మనుషులు శిలలుగా మారిపోతారు...

భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అనేక సంస్కృతులు, విశిష్టతలు వాటికి ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రత్యేక కథనాలు కూడా చెప్పుకుంటుంటారు. ఇలాంటి ఒక ప్రత్యేక ఆలయం రాజస్థాన్‌లో బర్మార్‌ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాత్మ అనే ఊరిలో ఉంది. ఇక్కడో ఆలయాల సమూహం ఉంది. 'కిరాడు' ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి. 
 
వీటికే 'కిరాతకూ‌ప' అన్న భయంకరమైన పేరు కూడా ఉంది. సాయం సంధ్య వేళల్లో ఆ పరిసరాల్లో తిరగడానికే భయపడిపోతారు ప్రజలు. సాయంత్రం అయితే ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా మారిపోతుంది. అక్కడ ఉన్న ఐదు ఆలయాలలో ఒకటి వైష్ణవాలయం, మరో నాలుగు శైవ క్షేత్రాలు నాలుగు గుళ్లలో సోమేశ్వరాలయం ప్రధానమైనది. ఈ ఆలయాలు అపురూప శిల్ప సౌందర్యంతో కనువిందు చేస్తాయి. 
 
అందుకే కిరాడు రాజస్థాన్ ఖజరహోగా పేరుగాంచింది. క్రీస్తుశకం పదకొండో శతాబ్దంలో చాళుక్య రాజులు వీటిని నిర్మించారని చెబుతారు. దాదాపు వందేళ్ల వరకు వీటి వైభవం కొనసాగింది. అలాంటి 'కిరాడు' పేరు చెబితే అక్కడి జనాలు హడలిపోతారు. అక్కడి వచ్చే పర్యటకుల వలన స్థానికులకు ఉపాధి బాగానే ఉంటుంది. కొంత మంది గైడ్‌లుగా వ్యవహరిస్తారు. 
 
కొంత మంది టీలు, భోజనాలు అమ్ముకుని బ్రతుకుతారు. అయితే అసుర సంధ్య వేళ కాగానే ఎవరూ తోడు రమ్మన్నా రారు. పైగా హెచ్చరిస్తారు కూడా. రాత్రి గడిచే కొద్దీ వాతావరణం మారిపోతుంటుంది. కిరాడు ఆలయం ప్రాంతమంతా కిరాతకంగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో వింత వింత శబ్దాలు మొదలవుతాయి. ఏడుపులు, పెడబొబ్బలు వినిపిస్తాయి. 
 
అయినా మొండిగా రాత్రంతా అక్కడే ఉంటే. తెల్లారే సరికల్లా వారు శిలగా మారిపోతారు. ఇది నిజమో అబద్ధమో తెలియదు. ఎందుకంటే అక్కడ రాత్రి ఎవరూ ఉండరు. ఉన్నవారు తెల్లవారాక ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. మొండిగా రేయంతా అక్కడుండే వారు రాయిగా మారిపోతారని మాత్రం గట్టి నమ్మకం. కొంత మంది పరిశోధకులు వీరి మాటను పట్టించుకోకుండా రాత్రి ఆలయంలో ఉండటానికి ప్రయత్నించారు. అర్థరాత్రి దాటాక అక్కడ వచ్చే శబ్దాలు విని బెంబేలెత్తిపోయారు. వెంటనే పలాయనం చిత్తగించారు.
 
ఆలయంలో మనుషులు శిలలుగా మారడం వెనుక స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. సుమారు ఎనిమిది వందల సంవత్సరాల కిందట ఒక ఆధ్యాత్మిక గురువు తన శిష్యులతో కలిసి దేశ సంచారంలో భాగంగా హాత్మ గ్రామానికి వచ్చాడు. అక్కడి కిరాడు ఆలయంలో వాళ్లు కొన్నాళ్లు ఉన్నారు. గురువు శిష్య బృందాన్ని అక్కడే ఉండమని చెప్పి తీర్థ సందర్శనకు వెళ్లాడు. ఆ గురువు మళ్లీ కిరాడు ఆలయాలకు వచ్చే సరికి శిష్యులంతా అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించారు. 
 
మాకు అనారోగ్యం కలిగినా గ్రామస్తులు ఎవరూ పట్టించుకోలేదని గురువుకు ఫిర్యాదు చేశారు శిష్యులు. సాటి మనిషి ప్రాణం మీదకు వస్తే పట్టించుకోకుండా పాశానంలా వ్యవహరిస్తారా అంటూ హాత్మ వాసులపై ఆ గురువు మండిపడ్డాడు. రాత్రి దాటాక ఈ ఆలయంలోకి ఎవరు ప్రవేశించినా వారు పాశానులైపోతారని శపించాడు. 
 
గ్రామస్తుల్లో ఒక మహిళ మాత్రం ఆ శిష్యులకు కొంత సేవ చేసిందట. ఆమెకు మాత్రం శాపం నుంచి విముక్తి ప్రకటించాడు గురువు. వెనక్కి తిరిగి చూడకుండా ఆలయ గ్రామం వదిలి వెళ్లిపోవాలని ఆజ్ఞాపించాడు. ఆ మాటతో గుడిలో నుంచి బయల్దేరిన ఆ మహిళ కొంత దూరం వెళ్లాక అత్యుత్సాహంతో వెనక్కి తిరిగి చూసిందట, అంతే అక్కడే శిలగా మారిపోయిందట. ఇప్పటికీ ఆమె విగ్రహం హాత్మ గ్రామశివారులో కనిపిస్తుంది.