శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. చెవాకులు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి
Last Modified: బుధవారం, 24 ఆగస్టు 2016 (17:13 IST)

పరమేశ్వరుడికే షాక్ ఇచ్చిన 'తాగుబోతు' నక్క... ఏం చేసింది...?

సమయం రాత్రి 11 గంటలయ్యింది. ఓ ఆటో గరగరమంటూ కర్నకఠోరమైన శబ్దం చేసుకుంటూ వచ్చి కిట్టయ్య ఇంటి ముందు ఓ శాల్తీని కిందకు తోసేసి అంతే స్పీడుతో వెళ్లిపోయింది. దబ్బుమన్న శబ్దం విని కిట్టయ్య గభాల్న లేచి ఇంటి గేటు తీసి చూచాడు. తన ఇంట్లో అద్దెకు ఉండే మనిషే. ఇంతల

సమయం రాత్రి 11 గంటలయ్యింది. ఓ ఆటో గరగరమంటూ కర్నకఠోరమైన శబ్దం చేసుకుంటూ వచ్చి కిట్టయ్య ఇంటి ముందు ఓ శాల్తీని కిందకు తోసేసి అంతే స్పీడుతో వెళ్లిపోయింది. దబ్బుమన్న శబ్దం విని కిట్టయ్య గభాల్న లేచి ఇంటి గేటు తీసి చూచాడు. తన ఇంట్లో అద్దెకు ఉండే మనిషే. ఇంతలో 'కిష్షయ్యా నీకు దండం...' అన్నాడు రమణయ్య అనబడే ఆ శాల్తీ. ఆ మాట అతడి నోటి నుంచి రాగానే గుప్పుమంటూ సారా వాసన ఇల్లంతా వ్యాపించింది. 
 
ఆ దెబ్బకు అప్పటివరకూ హాయిగా భుజంపై వేసుకుని ఉన్న తువాలును తీసి ముక్కు మూసుకుని... 'మళ్లీ తాగి వచ్చావా..' అంటూ గావు కేకలు పెట్టాడు కిట్టయ్య. 'నన్ను షమించండి... రేపష్నుంచి షాగను...' అంటూ పూటుగా తాగి ఉన్న నిషాతోనే లేచి ఇంట్లోకి పడుతూ లేస్తూ వెళ్లి తలుపు తీసి ధడేల్ మంటూ వేసేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే తలుపు తీసి బయటకొచ్చాడు రమణయ్య. తళతళమనే ధవళ వస్త్రాలతో మెరిసిపోతున్నాడు. అతడిని చూసి కిట్టయ్యకు ఆశ్చర్యమేసింది. ఏంటి రమణయ్యా ఎన్నిసార్లు చెపుతావయ్యా తాగనని అని ప్రశ్నించాడు. 'కిట్టయ్యగారు... మీకు ఇప్పుడు ఈ కథ చెప్పి తీరాల్సిందే' అంటూ కథ మొదలుపెట్టాడు.
 
" అదో కీకారణ్యం. అక్కడ అన్ని జంతువులతో పాటు ఓ నక్క కూడా నివశిస్తోంది. బండలు పగిలే ఎండలు... కరవుతో పచ్చని చెట్లూ, పుట్టలూ అన్నీ మాయమయ్యాయి. భూమి భగభగా మండుతోంది. నక్క ఆకలితో నకనకలాడుతోంది. తినేందుకు చిట్టెడు మాంసం కూడా దొరికే స్థితి లేదు. చిరు జంతువులను వేటాడేందుకు కాళ్లరిగేలా పరుగెత్తుతున్నా మోకాళ్ల నొప్పులే కానీ పాపం నక్కకు ఓ చిట్టి జంతువు కూడా కనబడటం లేదు. దానితో ఇక తన చావు ఖాయమనుకుంది. ఐతే ఎలాగూ చస్తాను కనుక ఆ చచ్చేముందే తన ఆకలి బాధను తీర్చమని దేవుడిని ప్రార్థించాలని నిర్ణయించుకుంది. 
 
ఒక మంచి బండ చూసుకుని ఒంటి కాలిపై నిలబడి... పరమేశా... ఓం నమఃశివాయ అంటూ మంత్రం జపించసాగింది. సూరీడు నడినెత్తిపైకి వచ్చి బండ మలమల మాడుతున్నా రెండో కాలిని కిందపెట్టలేదు. ఒంటికాలిపైనే నిలబడి అలానే శివ స్తోత్రం చేయసాగింది. నక్క ఘోర తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్తూ పరమేశ్వరుడు ప్రత్యక్షం కావడంతో నక్క నాట్యం చేయడం మొదలుపట్టింది. ఆనందంతో పిల్లిమొగ్గలు వేసింది. పల్టీలు కొడుతూ శివుడిని స్తుతిస్తూనే ఉంది. దీనితో పరమేశ్వరుడు... ఓ జంబుకమా... నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు.
 
నక్క కాస్త దిటవుగా నిలబడి... చుట్టూరా అంతా చూసి ఇలా అడిగింది. అలా కనబడే కొండలన్నీ ఏనుగు గుండె కాయలు కావాలి. ఇక్కడ ఎండి పోయిన ఈ చెరువు నీటితో కాదు... సారాతో నిండిపోవాలి. వాటిని నేను తనివితీరా ఆరగించాలి. ఏనుగు గుండెలు తిని సారా తాగుతూ మజా చేసుకోవాలి. అలా ఈ రాత్రంతా గడిపేశాక పొద్దుటే ఈ వరం ఇచ్చిన మీకు నా ప్రాణాన్ని ఆత్మార్పణం చేస్తాను అని చెప్పింది నక్క. శభాష్... కోరిక కోరడమే కాకుండా ప్రతిఫలంగా ప్రాణాన్ని కూడా ఇస్తానన్నావు కనుక.. తథాస్తూ అని కొండలన్నిటినీ ఏనుగు గుండెలు గానూ.. చెరువులో సారాను సృష్టించాడు పరమేశ్వరుడు. 
 
నక్క సంతోషానికి అంతేలేదు. ఏనుగు గుండెలు తింటూ సారాను పీకల దాకా తాగేసింది నక్క. తన ఆకలి, చిరకాల కోరికైన సారా పానము తీరడంతో సంతోషంగా నిద్రపోయింది. సూరీడు మెల్లగా తూర్పు దిక్కు నుంచి ఉదయిస్తున్నాడు. పక్షులు కిలకిలమంటూ అరుస్తున్నాయి. నక్కకు చటుక్కున మెలకువ వచ్చింది. ఆ వెంటనే దేవుడికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. అంతే... తన పైప్రాణాలు పైనే పోయాయి. అయ్యో ఇప్పుడు నేను చచ్చిపోవాలా... అంటూ నిట్టూర్చింది. 
 
వెంటనే ఓ నిర్ణయానికి వచ్చింది. దూరంగా సూదంటు ముళ్లపొద ఒకటి దాని కంటబడింది. పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ పొదలో వాడిగా ఉన్న ఓ పొడవాటి ముల్లును తీసికొని తన ఎడమ కంటిలో కతుక్కున పొడుసుకుంది. ఎడమ కనుగుడ్డు కాస్తా కారిపోయింది. కన్ను నుంచి రక్తస్రావం అవుతుండటంతో ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. జంబూకమా.. ఆకలి తీరింది కదా... మరి నాకిచ్చిన మాట ప్రకారం ఆత్మార్పణకు సిద్ధమేనా... అని అడిగాడు. 
 
అంత బాధలోనూ... ఆ నక్క... మీరెవరు అని ప్రశ్నించింది. ఆ మాటకు దేవుడు షాక్ తిన్నాడు. అదేంటి... నేను నీకు నిన్న వరమిచ్చాను కదా అని అడిగాడు. మీరు వరమిచ్చింది నాక్కాదు అంటూ మళ్లీ రెట్టించింది. మరెవరికి అని అడిగితే... మీరు నిన్న వరమిచ్చింది రెండూ కళ్లు ఉన్న మంచి నక్కకి. నేను అంధ నక్కను. నాకు ఓ కన్ను లేదు. పరీక్షగా చూసుకోండి. కాబట్టి మీరు ఏ నక్కకు ఇచ్చారో తెలుసుకునేందుకు ప్రయత్నం చేయండి అని చెప్పింది ఆ నక్క. అసలే గుంటనక్క. పైగా తాగుబోతు కూడా. అన్ని తెలివితేటలు దేవుడు ముందే ప్రదర్శించే సరికి మారుమాట్లాడకుండా దేవుడు సైతం అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు"
 
ఇదండీ కిట్టయ్యగారూ... కాబట్టి నేను అచ్చం ఆ తాగుబోతు నక్కలాంటోడ్ని. రాత్రి అలాగే మాట్లాడతా.. ఉదయాన ఇలాగే చెపుతా. కానీ నా తాగుడు మాత్రం మానను అంటూ చెప్పడంతో కిట్టయ్య షాక్ తిన్నాడు. ఐతే ఇక నువ్వు నా ఇల్లు ఖాళీ చేసి వెళ్లు రమణయ్యా అని చెప్పాడు కిట్టయ్య. అదీ సంగతి.