శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (18:59 IST)

నష్టాల్లో స్టాక్ మార్కెట్... రూ.27 వేల చేరువకు బంగారం ధర

దేశీయ స్టాక్ మార్కెట్‌ నష్టాల్లో కొనసాగుతోంది. మంగళవారం నాడు ముంబై స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 600 పాయింట్ల మేరకు నష్టపోయింది. అలాగే నిఫ్టీ కూడా 185 పాయింట్ల వరకు కోల్పోయింది. ఈ ప్రభావం కారణంగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.200 పెరిగి రూ.26,880గా ట్రేడవుతోంది. కేజీ వెండి ధర నామమాత్రమంగా రూ.35 పెరిగి రూ.34616 పలుకుతోంది. డాలర్ మారకం విలువ రూ.66.35 పైసలుగా ఉంది.
 
అయితే, స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల్లో జారుకోవడానికి అనేక కారణాలను మార్కెట్ విశ్లేషకులు చెపుతున్నారు. వీటిలో ప్రధానమైనది భారత స్థూల జాతీయ ఉత్పత్తి. తొలి త్రైమాసికంలో ఈ జీడీపీ 7 శాతానికే పరిమితమైంది. తొలుత వేసిన అంచనాలు 7.4 శాతంతో పోలిస్తే జీడీపీ తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఇదే సమయంలో వరల్డ్ బ్యాంక్, ఫిచ్, మూడీస్ తదితర సంస్థలు భారత వృద్ధి రేటు ముందస్తు అంచనాలను సవరించడం ఆందోళన కలిగించింది.
 
దీనికితోడు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో జరిపే పరపతి సమీక్ష తర్వాత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. దీని ప్రభావం భారత మార్కెట్‌ను తీవ్ర ప్రభావితం చేసింది. సెప్టెంబర్ 17 తర్వాత బాండ్లపై మరింత వడ్డీని పొందవచ్చని ఆయన అన్నారు. అదే జరిగితే, స్టాక్, బులియన్ మార్కెట్ల పెట్టుబడులు యూఎస్ బాండ్ మార్కెట్‌కు తరలిపోవడం ఖాయమని అంటున్నారు. 
 
ఇకపోతే ఇప్పటివరకూ చైనాలో వెలుగుచూసిన మాంద్యం, ఆర్థిక సంక్షోభం స్వల్పమేనని, ముందు ముందు చైనా ఉత్పత్తి గణాంకాలు మరింతగా దిగజారుతాయనే అంచనాలు ఉన్నాయి. ఇవి కూడా భారత మార్కెట్ పతనానికి ఓ కారణమయ్యాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఇటీవలి కాలం వరకూ తగ్గుతూ రాగా.. ఇపుడు పెరగడం ప్రారంభమయ్యాయి. 
 
ఇది కూడా మార్కెట్‌ను కొంత మేరకు ప్రభావితం చేసింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో యూఎస్ క్రూడాయిల్ ధర ఏకంగా 27 శాతం పెరిగింది. ఆగస్టు 1990 తర్వాత కేవలం మూడు రోజుల్లో ముడి చమురు ధరలు ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మేందుకు మొగ్గు చూపడం కూడా మరో కారణంగా ఉంది.