గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (23:09 IST)

అధిక బరువు రూపంలో వినేశ్‍‌ను వెంటాడిన దురదృష్టం : ఒలింపిక్స్ నిబంధనలు ఏం చెబుతున్నాయి!!

vinesh phogat
పారిస్ ఒలింపిక్స్ పోటీల నుంచి భారత రెజ్లర్ వినీశ్ ఫొగాట్ నిష్క్రమించారు. అధిక బరువు కారణంగా ఆమెపై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. ఫైనల్స్ ముంగిట వినేశ్‌పై అనర్హత వేటుపడటంతో కోట్లాది మంది భారత అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఇలా ఎందుకు జరిగిందంటూ చర్చ మొదలెట్టారు. అయితే, అంతర్జాతీయ ఒలింపిక్ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓసారి పరిశీలిద్దాం.. 
 
ఒలింపిక్స్ ఫ్లీస్టైల్ రెజ్లింగ్ పురుషుల్లో 57-125 కిలోల బరువు మధ్య ఆరు కేటగిరీలు ఉన్నాయి. ఇక మహిళల్లో 50, 53, 57, 62, 68, 76 కేజీల విభాగాలున్నాయి. మన వినేశ్ ఈ 50 కిలోల కేటగిరిలో పోటీ పడ్డారు. క్రీడాకారిణి ఆయా కేటగిరిలో ఉన్నారని నిర్ధరించేందుకు పోటీ జరిగే రోజు ఉదయం బరువును కొలుస్తారు. ప్రతి బరువు కేటగిరిలో రెండు రోజులపాటు టోర్నమెంట్ జరుగుతుంది. వినేశ్ పోటీపడే 50 కిలోల విభాగంలో పోటీలు మంగళవారం, బుధవారం జరుగాయి. బుధవారం చివరి పోటీలు. ఈనేపథ్యంలో క్రీడాకారిణులు తప్పనిసరిగా నిర్ణీత కేటగిరిలో బరువు ఉండేలా చూసుకోవాల్సిందే.
 
క్రీడాకారులను బరువు తూచే సమయంలో వారికి 30 నిమిషాల వ్యవధి ఇస్తారు. ఈ వ్యవధిలో వారు ఎన్నిసార్లైనా తమ బరువును కొలుచుకోవచ్చు. ఈ క్రమంలో వారు ధరించే జెర్సీలతో బరువు తూస్తారు. దీంతోపాటు వారికి ఇతర ఆరోగ్య పరీక్షలు చేసి ఎటువంటి అంటువ్యాధులు లేవని నిర్ధరిస్తారు. ఆటగాళ్లు గోళ్లు కత్తిరించుకున్నారో, లేదో పరిశీలిస్తారు. ఇక రెండో రోజు కూడా పోటీపడే వారికి బరువు కొలతలకు 15 నిమిషాలే కేటాయిస్తారు.
 
కానీ, వినేశ్ మంగళవారం బౌట్ సమయంలో తన బరువు నియంత్రణలోనే ఉంచుకున్నారు. ఆటగాళ్లు రెండు రోజులు బరువును నిర్ణీత కేటగిరి పరిధిలోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ, మంగళవారం రాత్రికి వినేశ్ రెండు కిలోల అదనపు బరువు ఉంది. రాత్రంతా నిద్రపోకుండా జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి చాలావరకు నియంత్రిచుకుంది. కానీ, చివరి 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది. ఆమెకు మరికొంత సమయం ఇవ్వాలన్న భారత బృందం అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించినట్లు సమాచారం. 
 
వినేశ్ గతంలో కూడా 53 కేజీల కేటగిరీలో పోటీ పడింది. క్రీడల్లో ఇది సర్వసాధారణం. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో కూడా ఇలా ఆడుతుంటారు. వినేశ్ బరువు తగ్గి దిగువ రెజ్లింగ్ కేటగిరిలో బరిలోకి దిగడం ఇదేం కొత్తకాదు. ఒలింపిక్ క్వాలిఫయర్ రౌండ్స్‌లో కూడా స్వల్ప తేడాతో బరువు ప్రమాణాలను అందుకొంది.
 
బరువు ప్రమాణాలను అందుకొనేందుకు ఆమె జట్టు కత్తిరించుకోవడంతోపాటు శరీరం నుంచి కొంత రక్తం కూడా తీయించుకొన్నట్లు వార్తలు వచ్చాయి. బౌట్లు గెలిచిన వెంటనే ఆమె నేరుగా శిక్షణ మొదలుపెట్టింది. ఆహారం కూడా తీసుకోలేదని ఆమె సన్నిహత వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఆమెను అధిక బరువు రూపంలో దురదృష్టం వెంటాడింది. కోట్లాది మంది భారతీయుల పతక ఆశలు గల్లంతయ్యాయి.