సాయ్ సెంటరులో దారుణం : హాకీ క్రీడాకారిణిపై అత్యాచారం ... నలుగురు అరెస్టు
ఒరిస్సా రాష్ట్రంలోని సుందర్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. 15 యేళ్ళ యువ హాకీ క్రీడాకారిణిపై నలుగురు కోచ్‌లే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సాయ్ సెంటరులోనే బాధితురాలు రెండేళ్లుగా శిక్షణ పొందుతోంది. ఆమెకు శిక్షణ ఇచ్చే కోచ్‌లో ఈ దారుణానికి తెగబడ్డారు. జిల్లాలోని రూర్కెలాలోని సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సెంటరులో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. జూలై మూడో తేదీ సాయంత్రం స్థానిక స్టేడియంలో కోచింగ్ సెషన్ ముగిసిన తర్వాత నలుగురు కోచ్‌లు, ఆ క్రీడాకారిణిని ఒక లాడ్జీకి తీసుకెళ్లి, లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయంపై ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. జూలై 21వ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని నలుగురు కోచ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై బీఎన్ఎస్‌లోని వివిధ సెక్షన్లతో పాటు సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం సెక్షన్ 6 కింద కేసులు నమోదు చేశారు. సోమవారం కోర్టులో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సంఘటన క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.