టోక్యో ఒలింపిక్స్ : లవ్లీనాకు కాంస్య పతకం - భారత బాక్సర్లు భళా
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్ సంచలనాలకు బుధవారం తెరపడింది. 64-69 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సూర్మనెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది. మూడు రౌండ్లలోనూ టర్కీ బాక్సర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
దీంతో ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా ఆమెనే విజేతగా తేల్చారు. ఈ ఓటమితో లవ్లీనా బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో ఇండియాకు వచ్చిన మూడో మెడల్ ఇది. గతంలో విజేందర్, మేరీకోమ్ కూడా బ్రాంజ్ మెడల్స్ గెలిచారు.
మరోవైపు, భారత కుస్తీవీరులు రవికుమార్ దహియా (57 కిలోలు), దీపక్ పునియా (86 కిలోలు) సంచలనం సృష్టించారు. తమ విభాగాల్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. బల్గేరియాకు చెందిన జార్జి వలెటినోవ్‌ను రవి 14-4 తేడాతో చిత్తు చేశాడు. ఇక చైనాకు చెందిన లిన్ జుషెన్‌పై దీపక్ పునియా 6-3 తేడాతో విజయం సాధించాడు.
రవికుమార్ గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. వరుసగా రెండో బౌట్లోనూ ప్రత్యర్థిని సాంకేతిక ఆధిపత్యంతోనే ఓడించాడు. అతడి ఉడుం పట్టుకు, టేక్‌డౌన్లకు జార్జి వలెటినోవ్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తొలి పిరియడ్‌లో వరుసగా 2, 2, 2 పాయింట్లు సాధించిన రవి 6-0తో ఆధిపత్యం సాధించాడు.
ఇక రెండో పిరియడ్‌లో మరింత రెచ్చిపోయాడు. వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రత్యర్థికి కేవలం 4 పాయింట్లే వచ్చాయి. మరో 16 సెకన్లు ఉండగానే బౌట్ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో కొలంబియాకు చెందిన టిగ్రరోస్‌పై రవి 13-2 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో కజక్‌స్థాన్ రెజ్లర్ సనయెన్ నురిస్లామ్‌తో తలపడనున్నాడు.
తొలి బౌట్లో దూకుడుగా ఆడిన దీపక్ పునియా క్వార్టర్స్‌లో అటు దూకుడు ఇటు రక్షణాత్మక విధానంలో విజయం సాధించాడు. ప్రత్యర్థి అనుభవాన్ని గౌరవించాడు. లిన్ జుషెన్‌ను 6-3తో ఓడించాడు. తొలి పిరియడ్‌లో దీపక్ ఒక పాయింటు సాధించి 1-0తో ముందుకెళ్లాడు.
ఇక రెండో పిరియడ్‌లో వరుసగా 2, 2, 1 సాధించాడు. ప్రత్యర్థికి 1,2 పాయింట్లు మాత్రమే రావడంతో విజయం భారత కుస్తీవీరుడినే వరించింది. ప్రిక్వార్టర్స్‌లో అతడు నైజీరియాకు చెందిన అజియోమొర్ ఎకెరెకెమిని 12-1 తేడాతో చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో అతడు డేవిడ్ మోరిస్‌తో తలపడనున్నాడు.