శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2024 (15:26 IST)

తన ప్రదర్శన ఇంకాస్త మెరుగుపర్చుకోవాలి : నీరజ్ చోప్రా

neeraj chopra
పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా, జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా తన విజయంపై స్పందించారు. దేశానికి పతకం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే, తన ప్రదర్శనను ఇంకా మెరుగుపరుుచుకోవాల్సి ఉందన్నారు. తప్పకుండా ఈ అంశంపై దృష్టిసారిస్తామని తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లు చాలా అద్భుత ప్రదర్శన చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కాగా, పారిస్ ఒలింపిక్ క్రీడా పోటీల్లో భారత్‌కు తొలి రజత పతకం వచ్చింది. ఫైనల్లో పాకిస్థాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ స్వర్ణం సాధించాడు. అర్షద్ 92 మీటర్ల మార్క్‌ను తాకగా.. నీరజ్ 89.45 మీటర్లు విసిరాడు. నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే స్పందించగా.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అభినందనలు తెలిపారు. అయితే, తన ప్రదర్శనపై సమీక్షించుకోవాల్సిన అవసర ఉందని నీరజ్ చెప్పుకొచ్చాడు. 
 
'దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయితే, నా ప్రదర్శనను ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉంది. తప్పకుండా దీనిపై మేం కూర్చొని మాట్లాడుకుంటాం. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు చాలా అద్భుత ప్రదర్శన చేశారు. జావెలిన్ త్రో ఈవెంట్లో చాలా పోటీ ఉంది. ప్రతి అథ్లెట్ తనదైన రోజున సత్తా చాటుతాడు. ఇది అర్షద్ డే. నేను మాత్రం వందశాతం కష్టపడ్డాను. కానీ, మరికొన్ని అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. మన జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు బాధగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మరోసారి సాధిస్తాననే నమ్మకం ఉంది' అని నీరజ్ చెప్పుకొచ్చాడు.