సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జులై 2023 (11:39 IST)

వింబుల్డన్ నయా చాంపియన్ కార్లోస్ అల్కరాజ్

Carlos Alcaraz
ప్రపంచ టెన్నిస్ చరిత్రలో నవశకం ఆరంభమైంది. ఇప్పటివరకు 23 గ్లాండ్ స్లామ్ టైటిళ్లతో పురుషుల సింగిల్స్‌లో రారాజుగా కొనసాగుతూ వచ్చిన టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ జోరుకు స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ బ్రేక్ వేశాడు. వరల్డ్ నెంబర్ వన్ అల్కరాజ్ వింబుల్డన్ నయా చాంపియన్‌‌గా అవతరించాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 1-6, 7-6, 6-1, 3-6, 6- 4తో జకోవిచ్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచాడు. 
 
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న జకోవిచ్, వింబుల్డన్‌పైనా కన్నేశాడు. కానీ అల్కరాజ్ పవర్ గేమ్ ముందు జకో నిలవలేకపోయాడు. ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్‌ను పేలవంగా ఆరంభించిన అల్కరాజ్... రెండో సెట్‌ను టైబ్రేకర్ వరకు తీసుకెళ్లి, జకోవిచ్‌పై పైచేయి సాధించాడు. ఆ తర్వాత సెట్లోనూ స్పెయిన్ వీరుడిదే జోరు కనిపించింది. 
 
కానీ నాలుగో సెట్‌ను 6-3తో చేజిక్కించుకున్న జకోవిచ్ మళ్లీ రేసులోకి వచ్చాడు. మ్యాచ్‌ను ఐదో సెట్లోకి మళ్లించాడు. నిర్ణాయక చివరి సెట్లో అల్కరాజ్ శక్తిమేరకు పోరాడి జకోవిచ్‌ను చిత్తు చేశాడు. అల ఓసారి సర్వీస్ బ్రేక్ చేయడంతో జకో పుంజుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో జకోవిచ్ తొడ కండరాల గాయంతో బాధపడడం కనిపించింది. ఓసారి అసహనం తట్టుకోలేక నెట్ పోల్‌ను తన టెన్నిస్ రాకెట్‌తో బలంగా కొట్టాడు. దాంతో టెన్నిస్ రాకెట్ వంగిపోయింది.