శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (10:26 IST)

ఫిఫా వరల్డ్ కప్ 2018 : నేటి నుంచి సాకర్ క్వార్టర్ ఫైనల్స్

ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీల్లో భాగంగా, నేటి నుంచి క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. శుక్రవారం జరిగే తొలి హైవోల్టేజ్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌‌లో ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌‌తో బెల్జియం తలపడనుంది.

ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీల్లో భాగంగా, నేటి నుంచి క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. శుక్రవారం జరిగే తొలి హైవోల్టేజ్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌‌లో ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌‌తో బెల్జియం తలపడనుంది. అంటే ఫైనల్ కాని ఫైనల్‌లా ఈ మ్యాచ్ ఇరు జట్ల మధ్య సాగనుంది.
 
ముఖ్యంగా, బ్రెజిల్ జట్టు ఆరోసారి వరల్డ్ కప్ కోసం తహతహలాడుతోంది. అలాగే, మాజీ చాంపియన్‌‌కు చెక్‌ చెప్పి పునర్‌‌వైభవాన్ని తీసుకురావాలని బెల్జియం పట్టుదలతో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ప్రపంచ నెం:2 బ్రెజిల్‌, అటాకింగ్‌ గేమ్‌‌తో ప్రత్యర్థులను వణికిస్తున్న మూడో ర్యాంకర్‌ బెల్జియం మధ్య మ్యాచ్‌ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
బ్రెజిల్‌ టీమ్‌ మ్యాచ్‌ మ్యాచ్‌‌కూ పదును తేలుతోంది. నెయ్‌మార్ ఫామ్‌‌లోకి రావడం ఆ టీమ్‌‌కు కొండంత బలం చేకూరినట్టయింది. ప్రీ క్వార్టర్స్‌‌లో మెక్సికోపై మెరిసిన నేమార్‌ గోల్‌ చేయడంతోపాటు మరో గోల్‌‌కు బాటలు వేశాడు. థియాగో, మిరాండాలతో బ్రెజిల్‌ రక్షణ శ్రేణి ఎంతో బలంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థులైన మిడ్‌ ఫీల్డర్లు ఉన్న జట్టు కూడా బ్రెజిలే.
 
ఇక స్ట్రైకర్‌ నెయ్‌మార్, కౌటినో, ఫిర్మినోలతో అటాకింగ్‌ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లుపరిగెత్తిస్తోంది. సాంబా జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించడం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు బెల్జియం కోచ్‌ రాబర్టో మార్టినెజ్‌ ప్రకటించాడు. ప్రీ క్వార్టర్స్‌‌లో జపాన్‌‌తో మ్యాచ్‌‌లో 0-2తో వెనుకబడినా.. పుంజుకుని మ్యాచ్‌‌లో విజయం సాధించడం ఆ జట్టు విశ్వాసాన్ని పెంచింది. రొమేలు లుకాకు, మ్యూనియర్‌, ఈడెన్‌ హజార్డ్‌, కెవిన్‌ డిబ్రుయెన్‌ ఫామ్‌‌లో ఉండడం కలిసొచ్చే అంశం. 
 
ఈ మ్యాచ్‌‌లో వీరి నుంచి టీమ్‌ మరోసారి అదేతరహా ప్రదర్శనను ఆశిస్తోంది. అటాకింగ్‌ విషయంలో రెడ్‌ డెవిల్స్‌ తిరుగులేని ఆటను ప్రదర్శిస్తున్నా.. డిఫెన్స్‌‌ లోపాలు జట్టును ఆందోళనకు గురిచేస్తున్నాయి. పసికూన జపాన్‌‌కు 2 గోల్స్‌ చేసే అవకాశం కల్పించడం డిఫెన్స్‌ బలహీనతలను బయటపెట్టింది. వీటిని అధిగమించి రెడ్‌ డెవిల్స్‌ గర్జిస్తుందా.. బ్రెజిల్‌ సెమీస్‌కు చేరుతుందా అనేది చూడాలి.