శ్రీరామ నవమి రోజున కారం, ఉప్పు ఎక్కువగా వాడొద్దు..
శ్రీరాముడు త్రేతా యుగంలో వసంత కాలంలో ఛైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. ఆ మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజునే భారతీయులంతా పండుగగా జరుపుకుంటారు.
పద్నాలుగేళ్లు అడవిలో వనవాసం చేసి, లంకలో రావణాసరుడిని మట్టుబెట్టి అనంతరం శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందాడు. ఈ శుభ సమయం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
ప్రతి సంవవత్సరం ఛైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత శ్రీరామ నవమిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం నాడు వచ్చింది.
ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో సీతారాములోరి కళ్యాణం జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కళ్యాణాన్ని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీరామ నవమి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండే వారు ఆహారం చేసేటప్పుడు పసుపు, ఎర్రని కారం లేదా ఎక్కువ ఉప్పు వంటి వాటిని వాడొద్దు. ఎందుకంటే కారం, ఉప్పు ఏది ఎక్కువైనా నిగ్రహంగా ఉండటం కొంత కష్టంగా ఉంటుంది.
శ్రీరామ నవమి రోజున ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరూ తాజా పండ్లను తీసుకోవాలి. ఇవి మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అలాగే వీటిని జ్యూస్ గా కూడా చేసుకుని తినొచ్చు. మీరు తాజా అరటిపండును కూడా తీసుకోవచ్చు.
శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకం మూడుసార్లు స్మరిస్తే.. "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే" అనే శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని చాలా మంది నమ్మకం.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఛైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించాడని నమ్ముతూ శ్రీరామ నవమిగా జరుపుకుంటారు.