శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 నవంబరు 2023 (13:47 IST)

తెలంగాణలో 'పొలిటికల్ బాహుబలి' రిలీజ్: 45 రోజుల్లో రూ. 709 కోట్లు వర్షం

cash seized
తెలంగాణలో నవంబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను లోబరుచుకునేందుకు ఆయా పార్టీలు నగదు, మద్యం, ఉచితాలు... కుమ్మరిస్తున్నాయి. కేవలం 45 రోజుల్లో ఎన్నికల సంఘానికి పట్టుబడిన ఉచితాలు, నగదు విలువ రూ. 709 కోట్లు దాటింది. ఇలా నగదు భారీగా పట్టుబడుతుండటంతో.. బాహుబలి సినిమా కలెక్షన్లకు మించి నగదు పట్టుబడుతుందేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నవంబర్ 25న ఒక్కరోజే ఏకంగా రూ. 10 కోట్లు పట్టుబడ్డాయి. తాజాగా ఖమ్మం, పెద్దపల్లిలో రూ. 11 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. పాలేరులో చేపట్టిన తనిఖీల్లో రూ. 3.5 కోట్లు నగదు పట్టుబడగా ఆ క్యాష్ ప్రధాన పార్టీలకు చెందినదిగా భావిస్తున్నారు.
 
మరోవైపు ఉచితాల తాయిలాలతో తెలంగాణ రోడ్లపై మినీలారీలు రయ్యమంటూ వెళ్తున్నాయి. వాటిలో మిక్సీలు, చీరలు, వాచీలు, మొబైల్ ఫోన్లు... ఇలా పలు వస్తువులు వున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద తెలంగాణలో ఓటర్లకు గాలం వేసేందుకు అన్ని పార్టీలు ఇలా తాయిలాలతో కుస్తీలు పడుతున్నాయి. మరి తెలంగాణ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.