శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (09:08 IST)

తెలంగాణ ఎన్నికల ఫలితాలు సునామీలా ఉంటాయి : రేవంత్ రెడ్డి

revanth reddy
తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు సునామీలా ఉంటాయని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని, డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణాలో ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు అనుకూలంగా ఓట్లు వేసి ఐదేళ్లపాటు సేవ చేయడానికి ప్రజలు అవకాశమిచ్చారని గుర్తుచేశారు. తాము రాజులం కాదని, ప్రజలకు సేవకులమన్నారు. 
 
ఈ ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి పార్టీకి 25కి మించి సీట్లు రావన్నారు. ఎన్నికల్లో తెలంగాణ మొత్తంలో ఒకే రకమైన సునామీ వచ్చింది. ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం రాదని చెప్పడం లేదు. మెజారిటీలోనే కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయని చెబుతున్నాయి. ఫలితాలు అనుకూలంగా లేవనే పోలింగ్ ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. గతంలో పోలింగ్ ముగియగానే ఆయన మీడియాతో మాట్లాడేవారు. 
 
ఎగ్జిట్ పోల్స్ చేసినవారు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ బెదిరిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ఆయన క్షమాపణ చెబుతారా? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావుల ముఖాల్లో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపించాయి. తరతరాలుగా అధికారంలో కొనసాగుతాననుకొని కేసీఆర్ కామారెడ్డిలో బరిలో దిగారు. తెలంగాణ సమాజం చైతన్యవంతంగా వ్యవహరిస్తుందని ప్రజలు నిరూపించారు. తెలంగాణ కోసం ఉద్యమించినవారు, 30 లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడారు. వారంతా గుణపాఠం చెప్పబోతున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు. కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. 
 
గురువారం సాయంత్రం 5 గంటల వరకూ మేం ప్రతిపక్షం. తర్వాత పాలకపక్షం. సాంకేతికంగా డిసెంబరు 9 వరకూ ఆగాలి. కాంగ్రెస్ శ్రేణులపై పాలకపక్షం బాధ్యత వచ్చేసింది. నా నుంచి ఇక పదునైన పదజాలంతో కూడిన మాటలు ఆశించవద్దు. మేం బాధ్యతగా పరిపాలన అందిస్తాం. మొదటి మంత్రివర్గ సమావేశంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడం, ప్రజాపాలన అందించే దిశగా పనిచేస్తాం. ఓడినవారిని కేసీఆర్ బానిసల్లా చూశారు. ఓడినవారు బానిసలు కారు. గెలిచినవారు రాజులు కారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ప్రజారంజక పాలన అందించాలనుకున్నప్పుడు ప్రతిపక్షం, పాలకపక్షం బాధ్యతగా వ్యవహరించాలి. 
 
కాంగ్రెస్ పాలనలో సంఘాలకు, ప్రతిపక్షాలకు మాట్లాడటానికి అవకాశం కల్పిస్తాం. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పునరుద్ధరిస్తుందని మరో గ్యారంటీ హామీతో మాట ఇస్తున్నా. సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తాం. అన్ని సంఘాలు, సామాజికవర్గాలకు మా పాలనలో అవకాశం కల్పిస్తాం. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. ప్రజా హక్కుల కోసం పోరాడేవారు ప్రభుత్వానికి స్వేచ్ఛగా అన్ని విషయాలు చెప్పే అవకాశం కల్పిస్తాం. ఎవరిపైనా ఆధిపత్యాన్ని చలాయించడానికి కాంగ్రెస్ అధికారాన్ని వినియోగించదు. మేం పాలకులం కాదు.. సేవకులం. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూసుకోవాలని పార్టీలోని పెద్దలు, నేతలకు నా సూచన. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో అమరవీరుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.