అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకొస్తారు : సీఎం రేవంత్ (Video)
తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా అని, దసరా అంటే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయని, అలాగే, అలయ్ బలయ్ అంటే గుర్తుకు వచ్చేది బండారు దత్తాత్రేయ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను అలయ్ బలయ్ ద్వారా దత్తాత్రేయ పునరుద్దరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి నలుదిశలా వ్యాపించడానికి, రాష్ట్ర సాధన ఆలస్యమైనప్పుడు పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ ఒక స్ఫూర్తి అని అన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు వేదిక అలయ్ బలయ్ అన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమన్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడేలా బండారు దత్తాత్రేయ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ సాధనకు అలయ్ బలయ్ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. మన రాష్ట్రానికి దసరా అతిపెద్ద పండుగ అని ముఖ్యమంత్రి అన్నారు. దసరా అంటేనే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తుందన్నారు.
అలాగే అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకు వస్తారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని దత్తాత్రేయ సన్మానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ నేత లక్ష్మణ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మేఘాలయ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ వారసురాలు (కుమార్తె)గా బండారు విజయలక్ష్మి నిర్వహించారు.