గూగుల్ పేలో విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా? ఇకపై ఆ పని చేయొద్దు!
విద్యుత్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఇపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లలో చెల్లించవద్దని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రకటించాయి. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు సేవలను ఆ యాప్‌లు నిలిపేశాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) వినియోగదారులు మొబైల్ ఫోనులో యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని బిల్లులు చెల్లించాలని సూచించాయి.
భారత రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను అనుసరించి ఆయా చెల్లింపు సంస్థలు జులై ఒకటో తేదీ నుంచి బిల్లుల చెల్లింపు సేవలు నిలిపేశాయి. దీంతో విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కం వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను వినియోగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిస్కంల యాప్/వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత ఫోనే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్లను ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డులు ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది.
ఏపీసీపీడీసీఎల్ : ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి central power యాప్ను ఫోనులో డౌన్‌లోడ్ చేసుకోవాలి. డిస్కం వెబ్‌సైట్ https://apcpdcl.in/ ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలి.
ఏపీఈపీడీసీఎల్ : ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి eastern power యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. డిస్కం వెబ్‌సైట్ apeasternpower.com ద్వారా బిల్లులు చెల్లించాలి.
ఏపీఎస్పీడీసీఎల్ : ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి southern power యాప్/వెబ్సైట్ www. apspdcl. in ద్వారా బిల్లులు చెల్లించాలి.