పొలానికి వెళ్లి పురుగుల మందు తాగిన రైతు... రైతు ప్రాణాలు కాపాడిన పోలీస్... ఎలా?
ఇంట్లో గొడవపడి పొలానికి వెళ్లి పురుగుల మందు తాగిన ఓ రైతు ప్రాణాలను పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రక్షించాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతును తన భుజాలపై వేసుకుని రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామానికి తీసుకెళ్లి, అక్కడ నుంచి సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి, ప్రాణాలు రక్షించాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, భేతిగల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జిల్లాలోని వీణవంక మండలం భేతిగల్‌కు చెందిన రైతు సురేశ్ బుధవారం ఇంట్లో గొడవపడి కోపంతో పొలానికి వెల్లాడు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన సురేశ్‌ను జయపాల్ తన భుజాన వేసుకుని పొలం గట్లపై దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో పరుగెత్తుకుంటూ వెళ్లి గ్రామంలోని ఆస్పత్రిలో చేర్చాడు. అక్కడ నుంచి వాహనంపై జమ్మిగుంట ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రైతును తన భుజాలపై మోస్తూ సకాలంలో ఆస్పత్రికి తీసుకొచ్చిన కానిస్టేబుల్ జయపాల్‌ను గ్రామస్థులతో పాటు వైద్యులు, సహచర పోలీసులు కూడా అభినందిస్తున్నారు.