సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (12:37 IST)

వివాహిత ఆత్మహత్య కేసు.. అత్త, ఆడపడుచుకు జీవితఖైదు

court
వరకట్నం వేధింపులను భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసును విచారించిన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి సెషన్స్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహితను ఆత్మహత్య చేసుకునేనా వేధించిన అత్త, ఆడపడుచుకి జీవిత కారాగారశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. తాజాగా వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం పూల్సంగీతండాకు చెందిన పత్తావత్ సురేందర్‌కు సునీతతో వివాహమైంది. వరకట్నంగా సునీత తల్లిదండ్రులు రూ.5 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. సురేందర్ - సునీత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
వివాహమైన రెండేళ్ల నుంచి సునీతను భర్త సురేందర్, అత్త పీక్లీ, అడపడుచు సంతోష అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టారు. ఈ వేధింపులు తాళలేక 2021 జనవరి 10వ తేదీన సునీత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
 
తాజాగా ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితులను దోషులుగా తేల్చి, ముగ్గురికీ యావజ్జీవ జైలుశిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కాగా, ఈ కేసులో కేవలం మూడేళ్లలోనే తుది తీర్పు వెలువడటం గమనార్హం.