బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మే 2024 (09:21 IST)

తెలంగాణాకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఓటు వేద్దామా? సీఎం రేవంత్ రెడ్డి

revanthreddy
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. తెలంగాణాకు గాడిద గుడ్డు ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి ఓటు వేద్దామా అంటూ ఆయన ఓటర్లను ప్రశ్నించారు. ముఖ్యంగా, నరేంద్ర మోడీ గారూ... నన్ను తిడితే మీకు ఏం వస్తుంది? ఢిల్లీ నుంచి వచ్చి భయపెడితే భయపడతానని అనుకున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, బాలాపూరులో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణకు మోడీ ఏమీ ఇవ్వలేదని చెప్పేందుకు ప్రతి చౌరస్తాలో గాడిద గుడ్డు ఫ్లెక్సీలు పెడదామని పిలుపునిచ్చారు. గాడిద గుడ్డు ఇచ్చిన వారికి ఓటేద్దామా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ ఇచ్చిన వారికి ఓటేయాలన్నారు. మంగళవారం  తన వద్దకు ఢిల్లీ పోలీసులను పంపించి నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు.
 
తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీ హైదరాబాద్ - విజయవాడ బుల్లెట్ రైలు ప్రకటిస్తారని భావించానని, కానీ తనపై విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, అమిత్ షాను గద్దె దించే వరకు కాంగ్రెస్ శ్రేణులు విశ్రమించరన్నారు. కేసీఆర్ గతంలో చెప్పిన దానినే మోడీ ఈరోజు నకలు కొడుతూ తనను తిట్టారన్నారు. తాను ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని.. తాము బీసీ గణన చేస్తామంటే ఎందుకు మెచ్చుకోవడం లేదని ప్రశ్నించారు. 
 
వయస్సులో, అనుభవంలో మోడీ తన కంటే చాలా పెద్దవారని... తనకు సూచనలు చేయాలి, సలహాలు ఇవ్వాలి కానీ విమర్శలు ఎందుకన్నారు. కానీ ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఏమిటన్నారు. ఇది గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధమన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. తప్పుడు కేసులతో కేసీఆర్ తనను జైల్లో పెడితే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణలో కారు లేదు కాబట్టే కేసీఆర్ బస్సు వేసుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.