మల్లన్న సాగర్‌పై చర్చ సిద్ధం... హరీశ్ రావు సవాల్‌ను స్వీకరించిన మంత్రి వెంకట రెడ్డి
మల్లన్న సాగర్‌పై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసరగా, ఆ సవాల్‌ను సీఎం స్వీకరించాల్సిన అవసరం లేదని, తాను స్వీకరిస్తున్నట్టు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం, పదేళ్ల భారాస పాలనలో చేసిన అప్పు, అవినీతి, ఎవరెంత దోచుకున్నారో ఆ పార్టీ నేతలతో చర్చించడానికి తాను సిద్ధమన్నారు. తనతో చర్చకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. ఎవరొస్తారో రావాలని సవాల్ చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రజలు, మీడియా ముందు బహిరంగ చర్చ పెడదామని, అన్ని అంశాలపై చర్చిద్దామని అన్నారు. భారాస నేతల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు.
'మల్లన్నసాగర్‌పై చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్ చేశారు. ఆయన సవాల్‌కు రేవంత్ రావాల్సిన అవసరం లేదు, ఆ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. పదేళ్లలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా భారాస నేతల ఆదాయం పెరిగింది. దేశంలోనే సంపన్న ప్రాంతీయ పార్టీగా భారాస ఎలా ఎదిగింది? మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లు తామే నీతిమంతులం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. మూసీ నిర్వాసితులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తే వారికి రాజకీయంగా మాట్లాడడానికి ఏం ఉండదని కేటీఆర్, హరీశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. భారాస సర్కారే 2016లో మూసీ ఒడ్డు నుంచి 50 మీటర్లు బఫర్ జోన్ అని జీవో తెచ్చింది. అందులో నా ఇల్లు కూడా పోతుంది' అని జూపల్లి తెలిపారు.