శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: సోమవారం, 2 ఆగస్టు 2021 (12:15 IST)

రేవంత్ టచ్‌లో 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? ప్రగతి భవన్‌లో పరేషాన్?

2014 ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్ల మెజార్టీ అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తనకు గండం లేకుండా ఉండటానికి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారు. బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి , కోనేరు కోనప్పతో మొదలు పెట్టి టీడీపీలో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 11 మందిని లాగేశారు. 
 
మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కించారు. సీపీఐ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను గులాబీ గూటికి తీసుకొచ్చారు. ఇక 2018లో 88 సీట్లతో బంపర్ మెజార్టీ వచ్చినా ఆపరేషన్ ఆకర్ష్‌ను కొనసాగించాడు కేసీఆర్. కాంగ్రెస్ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. 12 మందిని లాగేసి.. ఏకంగా కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసినట్లు ప్రకటించారు.
 
కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి సరిపడా బలం ఉన్నా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకోవడంపై మేథావి వర్గాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే ఆకర్ష్ మంత్రం గులాబీ బాస్‌కు బిగ్ స్ట్రోక్ ఇవ్వనుందని తెలుస్తోంది. 
 
తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలే లేకుండా చేద్దామ‌ని కంక‌ణం క‌ట్టుకున్న కేసీఆర్‌కు.. ఇప్పుడు స్వ‌ప‌క్షంలోనే సంక్షోభం త‌ప్పేలా లేద‌న్న వాద‌న‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. తాను తీసిన గోతిలో తానే ప‌డినట్లుగా గులాబీ బాస్ కు షాక్ ఇవ్వబోతున్నారట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్‌కు చెందిన 40 మంది కీల‌క నేత‌లు.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి ట‌చ్‌లోకి వెళ్లార‌నే ప్రచారం జరుగుతోంది. 
 
ఈ 40 మందిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి నేతలు ఉండటం ప్రగతి భవన్‌ను షేక్ చేస్తుందని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాక‌పోవ‌చ్చ‌నే అంచ‌నాతో కొందరు..  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌మ‌కు మ‌రోసారి టికెట్ రాక‌పోవ‌చ్చ‌నే భ‌యంతో మ‌రికొంద‌రు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా స‌మాచారం. 
 
ఇప్ప‌టికే కొంద‌రు టీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని ఢిల్లీలో.. మ‌రికొంద‌రు బెంగ‌ళూరులో క‌లిసి మంత‌నాలు సాగించిన‌ట్టుగా తెలుస్తోంది. కొడంగ‌ల్ ప‌ర్య‌ట‌న పేరుతో రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ రెండు, మూడుసార్లు అత్య‌వ‌సరంగా బెంగ‌ళూరు వెళ్ల‌డం ఇందుకు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది. 
 
హైదరాబాద్ లో అయితే ఇంటలిజెన్స్ కు తెలిసే అవకాశం ఉండటంతో ఢిల్లీ, బెంగళూరు కేంద్రంగా టీఆర్ఎస్ నేతలతో రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు. ఈ విషయం తెలియడంతో కేసీఆర్ హైరానా పడుతున్నారని, రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లిన నేతలపై నిఘా పెట్టారనే సమాచారం తెలంగాణ భవన్ వర్గాల నుంచి వినిపిస్తోంది.
 
రేవంత్​ రెడ్డి తొలి ఆపరేషన్​ ఆకర్ష్​ ఖమ్మం నుంచే ప్రారంభించనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఖమ్మం నుంచి ఇద్దరు, భద్రాద్రినుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు  రేవంత్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ నలుగురు ఎమ్మెల్యేలు వేర్వేరుగా రేవంత్​తో హైదరాబాద్ లో రహస్య సమావేశం అయినట్లు సమాచారం. 
 
అనుచరుల దందాలతో ఎక్కువగా వివాదాల్లో నిలిచే ఓ ఎమ్మెల్యే.. గతంలో టీడీపీలో పని చేసిన, రేవంత్​తో ఎక్కువగా సాన్నిహిత్యం ఉన్న మరో ఎమ్మెల్యే ఇప్పటికే రెండు సార్లు భేటీ అయినట్లు చెబుతున్నారు. ఇక నియోజకవర్గంలో ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ, ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మరో ఎమ్మెల్యే.. ఓ ఏజెన్సీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఎమ్మెల్యే సైతం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని తెలుస్తోంది. 
 
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో మంతనాలు సాగిస్తున్నారని సమచారం. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు, మెదక్ , ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా రేవంత్ కు టచ్ లో ఉన్నారని అంటున్నారు. 
 
నిజామాబాద్, వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఎంపిక కాగానే.. కేసీఆర్ కేబినెట్‌లో ఉన్న ముగ్గురు మంత్రులు, ఇద్ద‌రు మాజీ మంత్రులు ఆయ‌న‌కు వాట్సాప్ కాల్ చేసి విష్ చేశార‌ని తెలుస్తోంది. 
 
ఆ మాజీల్లో ఒక‌రు ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉండ‌గా, మ‌రొక‌రు గ‌తంలో కాంగ్రెస్‌లో ప‌నిచేసిన నేత అని స‌మాచారం. అయితే మాజీ మంత్రుల‌పై ప్ర‌స్తుతం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఏం చేయాలో తెలియ‌క గులాబీ బాస్ త‌లప‌ట్టుకున్న‌ట్టుగా తెలుస్తోంది.  
 
ప్ర‌స్తుతం మంత్రులుగా కొన‌సాగుతున్న‌వారిపై ఏ చ‌ర్య తీసుకున్నా.. మ‌ళ్లీ అది ఈట‌ల వంటి ఎపిసోడ్‌కు దారి తీసే అవ‌కాశం ఉంద‌ని కేసీఆర్ భ‌య‌ప‌డుతున్న‌ట్టుగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు కొన్ని సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉంటూ ఏ పదవిలేని వారు, పదవినుంచి తప్పించిన వారు, ప్రాధాన్యం లేని వారు.. ఏ పార్టీలోకి వెళ్లలేక టీఆర్ఎస్‌లోనే ఉన్నవారు.. 
 
ఇలా అసంతృప్త స్వరం వినిపిస్తున్న వారి లిస్ట్ సైతం రేవంత్ టీం ఇప్పటికే సేకరించిందని సమాచారం. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న పెద్ద నేతలను సైతం లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సమయం చూసి కేసీఆర్ కు దెబ్బ కొట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందే చేరికలను మొదలు పెట్టి.. 
 
వరుసగా గులాబీ బాస్ కు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. కాంగ్రెస్ లోకి ఆపరేషన్ ఆకర్స్ మొదలైతే.. తెలంగాణ రాజకీయ సమీకరణలు అనూహ్యాంగా మారిపోయే అవకాశం ఉందంటున్నారు.