హిజ్రాతో సహజీవనం చేశాడు.. డబ్బు ఇవ్వలేదని గొంతు కోశాడు.. ఎక్కడ..?
సుప్రీంకోర్టు తీర్పు తరువాత సమాజంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమ్మాయి అమ్మాయి కలిసి ఉండడం, అబ్బాయి.. అబ్బాయి కలిసి ఉండడం, అబ్బాయి - హిజ్రాలు కలిసి తిరగడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి. అయితే ఇక్కడే ఒక కొత్త ట్విస్ట్ ఉంది. అదే హిజ్రాతో ఒక వ్యక్తి ప్రేమ పేరుతో సహజీవనం చేశాడు. అంతేకాదు హిజ్రా దాచుకున్న డబ్బును తీసుకుని అది ఖర్చు పెట్టి మళ్ళీ డబ్బు కోసం హింసించడం మొదలెట్టాడు.
మహబూబాబాద్ గార్ల మండలం అంజనాపురంకు చెందిన హిజ్రా రాధికకు సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. హిజ్రా అంటే మామూలు అమ్మాయిలా బతకవచ్చని భావించింది. సురేష్‌ను ఎంతగానో నమ్మింది. దీంతో సురేష్ అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చింది. ఇలా 3 లక్షల రూపాయల డబ్బును సురేష్‌ను నమ్మి ఇచ్చింది రాధిక.
హిజ్రాల వద్ద ఇంత డబ్బు ఉంటుందా అని అనుకున్న సురేష్ ఆమెను డబ్బుల కోసం హింసిస్తూ వచ్చాడు. దీంతో సురేష్ అసలు విషయం తెలుసుకుంది. సురేష్‌ను గట్టిగా నిలదీసింది. దీంతో సురేష్ ఆగ్రహంతో ఊగిపోతూ కత్తితో రాధికపై దాడికి దిగాడు. చావుబతుకుల మధ్య రాధిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు పరారీలో ఉన్నాడు.