మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 మే 2022 (18:34 IST)

అసనికి తోడైన కొత్త ద్రోణి... రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు

Rains
బంగాళాఖాతంలో అసని తుఫాను ప్రభావం కొనసాగుతోంది. ఈ తుఫానుకు ప్రస్తుతం కొత్త ద్రోణి తోడైంది.  అసని తుఫానుకు తోడు బంగాళాఖాతంలో మరో ద్రోణి ఏర్పడిందని, ద్రోణి ప్రభావంతో రాగాల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  
 
ఈ ద్రోణి కారణంగా దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రానున్న రెండు రోజుల్లో వాతావరణం మేఘావృతమై, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఇకపోతే... అసని తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కాకినాడకు ఆగ్నేయ దిశగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర తుఫాను సుమారుగా వాయువ్య దిశగా పయనించి మంగళవారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుంది. 
 
ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా కదిలి ఉత్తర ఆంధ్ర-ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది. అది క్రమంగా బలహీనపడి తదుపరి 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.