శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (23:09 IST)

పురుగుల బిర్యానీ.. హోటల్‌ను సీజ్ చేసిన అధికారులు..

కాసులకు కక్కుర్తిపడి కొంతమంది హోటల్ యజమానులు జనాలకు పురుగుల బిర్యానీ విక్రయిస్తున్నారు. రెండు మూడు రోజులుగా నిల్వ ఉన్న, కుళ్లిన చికెన్‌తో బిర్యానీ వండుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అయితే నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. బిర్యానీ తిందామని హోటల్‌కి వచ్చిన మున్సిపల్ కమిషనర్‌కి పురుగుల బిర్యానీ వడ్డించి అడ్డంగా బుక్కయ్యారు.
 
నిర్మల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మి గ్రాండ్ హోటల్‌కి మునిసిపల్‌ కమిషనర్ బాలకృష్ణ, సిబ్బందితో కలిసి లంచ్‌ చేద్దామని వెళ్లారు. నాలుగు ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేశారు. వెంటనే హోటల్‌ సిబ్బంది వేడివేడి బిర్యానీ తెచ్చి వడ్డించారు. అయితే సిబ్బందితో సహా కమిషనర్ ఒక్కసారిగా షాకయ్యారు. కారణం వారికి వడ్డించిన బిర్యానీలో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో అందరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
 
వెంటనే అలర్ట్ అయిన కమిషనర్ బిర్యానీని పక్కన పెట్టి సిబ్బందితో కలిసి హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. హోటల్ కిచెన్ గదిలో తనిఖీలు చేయగా ఫ్రిజ్ లో కుళ్లిన చికెన్ , కలుషిత ఆహారం బయటపడింది. ప్రిజ్‌లో ఉంచిన చికెన్ పురుగులు పట్టి ఉండటంతో మున్సిపల్ కమిషనర్ కోపం నషాళానికి అంటింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అంటూ హోటల్‌ను సీజ్ చేశారు.