ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (10:13 IST)

మరో మూడు గంటల్లో పెళ్లి - రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం

మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సివుండగా రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం పాలయ్యాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఇంటి విషాదం నెలకొంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో జరిగింది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పాలమూరు జిల్లా క్రిస్టియన్ పల్లికి చెందిన భువనాల చైతన్య కుమార్ (35) అనే వ్యక్తి నారాయణపేట జిల్లాలోని తిర్మాలాపూర్‌లో ప్రభుత్వ టీచరుగా పని చేస్తున్నారు. ఇటీవల ఆయనకు వనపర్తి జిల్లాకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ వివాహం గురువారం ఉదయం 11 గంటలకు చర్చిలో జరగాల్సివుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా ఘనంగానే చేశారు. 
 
అయితే, చైతన్య కుమార్ గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కారులో జడ్చర్లకు బయలుదేరారు. మార్గమధ్యంలో నక్కలబండా తండా మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చైతన్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన చైతన్య తల్లిదండ్రులు బోరును విలపించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.