4న పెళ్లి - 5న రిసెప్షన్ - 6న వరుడు ఆత్మహత్య - ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ నెల నాలుగో తేదీన పెళ్లి చేసుకున్న వరుడు 5వ తేదీన రిసెప్షన్ జరుపుకున్నాడు. 6వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పుణ్యవరంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేష్ (29)కు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడు గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 4వ తేదీన వివాహం జరిగింది. ఆ మరుసటి రోజు వరుడు స్వగ్రామంలో రిసెప్షన్ జరిగింది. ఇందులో నూతన వధూవరులు సంతోషంగా పాల్గొన్నారు. వరుడు అయితే తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు.
ఆ మరుసటి రోజైన 6వ తేదీన విజయవాడ సమీపంలోని గుణదల దైవదర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అద్దెకు కార్లను కూడా నరేష్ మాట్లాడాడు. తెల్లవారుజామున నిద్రలేచి స్నానానికి వెళ్లేందుకు బాత్రూమ్‌కు వెళ్లి విగతజీవిగా మారిపోయాడు. బ్లేడుతో గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
స్నానం చేసి వస్తానని వెళ్లిన నరేష్ ఎంతకీ రాకపోవడంతో బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా, అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. రక్తపు మడుగులో పడివున్న నరేష్‌ను చూసి ఇరు కుటుంబాల సభ్యులు హతాశులయ్యారు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకోవడంత తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో వరుడు మృతి చెందాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.