శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 23 ఆగస్టు 2019 (22:12 IST)

నామినేటేడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్లాన్... సబితా ఇంద్రారెడ్డికి హోం శాఖా?

నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఈ పదవులు తమకు దక్కుతాయో లేదోననే భయం పార్టీలో చాలాకాలంగా ఉన్న నేతలను పట్టిపీడీస్తోంది. ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్‌లో చేరిన నేతలు నామినేటేడ్ పదవులను ఎగురేసుకుపోతారనే ఆందోళన చోటుచేసుకొంది. 
 
మొదటి నుండి పార్టీలో ఉన్నవారికే నామినేటేడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ ఇటీవలి కాలంలో హామీ ఇచ్చారు. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు వంటి అంశాల్లో పార్టీలో మొదటి నుండి ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చినవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.
 
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టును నేతకాని వెంకటేష్‌కు కేసీఆర్ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో వెంకటేష్ చెన్నూరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
 
పార్లమెంట్ ఎన్నికల సమయానికి ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరిన వెంటనే ఆయనకు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టును కేటాయించారు.వెంకటేష్ టీఆర్ఎస్‌లో చేరేలా మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలకంగా వ్యవహరించారని చెబుతారు. వెంకటేష్ టీఆర్ఎస్‌లో చేరడంతో వివేక్‌కు టీఆర్ఎస్‌లో టిక్కెట్టు దక్కలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరారు.
 
వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్మెన్ స్థానాన్ని గండ్ర జ్యోతికి టీఆర్ఎస్ కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుండి గండ్ర జ్యోతి భర్త గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేసి విజయం సాధించాడు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. 
 
భూపాలపల్లి జడ్పీ ఛైర్మెన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మెన్ పదవికి గండ్ర జ్యొతికి ఇచ్చారు.కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి కూడ కేబినెట్ బెర్త్ కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. లోక్ సభ ఎన్నికల ముందు సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. సబితా ఇంద్రారెడ్డికి హోం మంత్రిత్వశాఖను కేటాయిస్తారనే ప్రచారం కూడా లేకపోలేదు.