టీపీసీసీ బాధ్యతల స్వీకరణకు రంగం సిద్ధం.. ఏర్పాట్లు ముమ్మరం
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరుస భేటీలతో బిజీ బిజీ అయ్యారు. టీపీసీసీ బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లపై రంగం సిద్ధం అవుతోంది.
ఈ నెల 7న గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా నియోజకవర్గం నుంచి ఐదు వేల బైక్‌లతో భారీ ర్యాలీగా తరలివెళ్లనున్నట్టు ఎల్‌బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మల్‌రెడ్డి రాంరెడ్డి తెలిపారు.
హస్తినాపురం డివిజన్ టీకేఆర్ రోడ్‌లోని వీఆర్ గ్రాండ్ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతి డివిజన్ నుంచి 5 వందల బైక్‌లతో బుధవారం ఉదయం 9గంటలకు చైతన్యపురి పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని, అక్కడి నుంచి ర్యాలీతో పెద్దమ్మ గుడికి చేరుకోనున్నట్టు చెప్పారు.
ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుజాత, ఆయా డివిజన్‌ల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.