గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (15:28 IST)

కేసీఆర్.. సీఎం అనే పదాన్ని కమీషన్ మ్యాన్‌గా మార్చేశారు- ఖుష్భూ

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త ఖుష్బూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో కవితకు మాత్రమే భరోసా వుందని, మహిళల కోసం ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదని, మహిళా వ్యతిరేత ప్రభుత్వం ఇదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేయలేదన్నారు. 
 
టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఖుష్బూ ధ్వజమెత్తారు. వరంగల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఖుష్బూ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్.. సీఎం అనే పదాన్ని కమీషన్ మ్యాన్‌గా మార్చేశారని.. విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పాలని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 
 
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. ఓ మహిళ విద్యను అభ్యసిస్తే.. ఆ ఇళ్లే విద్యను అభ్యసించినట్లు అవుతుందని నమ్మారని.. అలాంటి కాంగ్రెస్ పార్టీ, ఓ మహిళను ప్రధానిని చేసిందని, రాష్ట్రపతిని చేసిందని, స్పీకర్‌ పదవిని ఇచ్చిందని ఖష్బూ గుర్తు చేశారు.