ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:17 IST)

తెలంగాణలో 3వేలకు చేరువలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 1,11,726 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,909 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
 
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఆరుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,752కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 584 మంది కోలుకున్నారు.
 
రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,04,548కి చేరింది. ప్రస్తుతం 17,791 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 11,495 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 487 కేసులు నమోదయ్యాయి.
 
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఎక్కడికక్కడ నివారణ చర్యల్ని కఠినతరం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వందల్లో ఉన్న పాజిటివ్ కేసులు కాస్త సెకండ్ వేవ్‌తో వేలల్లోకి చేరాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

ఇప్పటికే ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచింది. అయితే విడ్ కేసులు పెరగడంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో కొవిడ్ సేవలు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

తెలంగాణపై కరోనా పంజా
ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కోటి లోని కమాండ్ కంట్రోల్ రూం లో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. కరోనా చికిత్స ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాలతో, 3 గంటలకు ప్రైవేట్ నర్సింగ్ హోం అధిపతులతో మంత్రి ఈటల రాజేందర్ భేటీ అవ్వనున్నరు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ అప్రమత్తం చేయనున్నారు. ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్వారంటైన్ సెంటర్లను ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.