శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:47 IST)

తెలంగాణాలో బాగాతగ్గిన పాజిటివ్ కేసులు... త్వరలో లాక్‌డౌన్ ఎత్తివేత?

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. ముఖ్యంగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అలాగే, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ చర్యలు ఫలించాయి. ఫలితంగా చాలా ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసుల నమోదు గణనీయంగా తగ్గింది. 
 
సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన చర్యల ఫలితంగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా గత నాలుగైదు రోజుల్లో నమోదైన కేసులను తీసుకుంటే, కరోనా కట్టడిలో ప్రభుత్వం విజయవంతం అవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 
 
గత శుక్రవారం 13 కేసులు, శనివారం కేవలం 7 కేసులు మాత్రమే తెలంగాణలో నమోదయ్యాయి. ఇదేసమయంలో టెస్టింగ్ సామర్థ్యాన్ని సైతం అధికారులు పెంచారు. కరోనా వైద్య పరీక్షలు అధికంగా జరుగుతూ ఉన్నప్పటికీ, కేసుల సంఖ్య కనిష్టానికి పడిపోవడం శుభసంకేతమేనని అధికారులు అంటున్నారు.
 
ప్రస్తుతం తెలంగాణాలో మొత్తం కేసులు 990గా ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం నమోదవుతున్న కేసులు మున్ముందు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు. ఓ దశలో రోజుకు 60 నుంచి 80 వరకూ కొత్త కేసులు నమోదైన రాష్ట్రంలో, ఇప్పుడు ఆ సంఖ్య 10కన్నా తక్కువకు చేరింది. ఇదే కొనసాగితే, త్వరలోనే లాక్‌డౌన్ నుంచి మరిన్ని మినహాయింపులు ఇచ్చి, ప్రజా జీవితాన్ని సాధారణ స్థాయికి తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.
 
కాగా, మొత్తం కేసుల సంఖ్య 990గా ఉంటే, యాక్టివ్ కేసుల సంఖ్య 658గా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్న 307 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 25 మంది మృత్యువాత పడ్డారన్న సంగతి తెలిసిందే. శనివారం ఒక్కరోజే 16 మందిని డిశ్చార్జి అయ్యారు.