సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (14:11 IST)

అవయవ మార్పిడి పేరుతో పారిశ్రామికవేత్తకు రూ.6 కోట్ల కుచ్చుటోపీ!

cyber hackers
తెలంగాణ రాష్ట్రంలో అవయవమార్పిడి పేరుతో బాధితులకు ఆర్థిక సాయం చేయం పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ పారిశ్రామికవేత్తకు ఏకంగా రూ.6 కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టారు. దీనిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి రసాయనిక ఎరువుల సంస్థ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఆ సంస్థ తరపున అనాథలు, స్వచ్ఛంద సంస్థలకు సాయం అందిస్తుంటారు. 
 
ఈ క్రమంలో గతేడాది జూన్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఆసుపత్రి ప్రతినిధిని అంటూ ఓ మహిళ ఎండీకి ఫోన్‌ చేసింది. ఒకరికి అవయవ మార్పిడి చేయాల్సి ఉందని, అందుకు ఆర్థికసాయం అందించాలంటూ కోరింది. వాస్తవమేనని భావించిన ఆ వ్యక్తి మహిళ సూచించిన ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు గత జూన్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ ఆన్‌లైన్‌లో రూ.6.69 కోట్లు పంపించారు.
 
సీఎస్‌ఆర్‌ కింద ఈ సాయం వివరాలు చేర్చేందుకు ఆ వ్యక్తి బిల్లులు, ఇతర ఆధారాలు పంపాలని మహిళను కోరారు. దీంతో ఆమె స్పందించకపోవడంతో ఇటీవల గట్టిగా అడిగారు. అప్పటి నుంచి సైబర్‌ నేరగాళ్లు ఆ వ్యక్తి మొబైల్‌ ఫోనుకు అభ్యంతరకర చిత్రాలు, సందేశాలు పంపడం ప్రారంభించారు. 
 
డబ్బులు మళ్లీ డిమాండ్‌ చేస్తే మార్ఫింగ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. దీంతో ఆ మహిళ చెప్పిందంతా బూటకమని తెలుసుకున్న ఎండీ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.