గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (14:05 IST)

హైదరాబాదులో డబుల్ డెక్కర్ బస్సులు నడుస్తాయా? కేటీఆర్ ఏమన్నారు..?

Double decker buses
డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం అంటే హైదరాబాద్ వాసులకు అదో హాయి. హైదరాబాద్ సిటీ అందల్ని చూస్తూ వెళ్తుంటే ఆ థ్రిల్ అదిరిపోయేది. అలాంటి మరపురాని ఆనందాల్ని ఓ 20 ఏళ్ల కిందటి వాళ్లు పొందారు. కాలక్రమంలో రకరకాల బస్సులు వచ్చేశాక... ఈ డబుల్ డెక్కర్ కాన్సెప్ట్ కనుమరుగైంది. ఈ రోజుల్లో కొన్ని విదేశాల్లో తప్పితే... మన దేశంలో అలాంటివి కనిపించట్లేదు.
 
తాజాగా ఇదే అంశంపై ఓ ట్విట్టర్ యూజర్... మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. డబుల్ డెక్కర్ బస్సులు కావాలని కోరారు. వెంటనే స్పందించిన కేటీఆర్... అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌కు తాను డబుల్ డెక్కర్లో వెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ రోడ్లపై తిరిగే డబుల్ డెక్కర్ బస్సులను ఎందుకు నిలిపివేశారో అర్థంకాలేదంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. డబుల్ డెక్కర్లను మళ్లీ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
 
మునిసిపల్ శాఖ మంత్రి ట్వీట్‌కు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. డబల్ డెక్కర్లను రోడ్లపైకి మళ్లీ తెచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై టీఎస్ ఆర్టీసీ (టీఎస్సార్‌టీసీ) ఎండీతో మాట్లాడతానని కేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు పువ్వాడ అజయ్.
 
మొత్తానికి ఇలా... ఓ యూజర్ ట్వీట్... ఇద్దరు మంత్రుల మధ్య చర్చకు దారితీసింది. అలాగే... త్వరలో హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతాయనే అంచనాకి అది ఊపిరి పోస్తోంది. మరి టీఎస్ ఆర్టీసీ ఎండీ ఎలా స్పందిస్తారో చూడాలి.