గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (08:48 IST)

తెలంగాణాలోకి అడుగుపెట్టాలంటే ఈ-పాస్ తీసుకోవాల్సిందే : డీజీపీ

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ అమలుకానుంది. ఈ నేప‌థ్యంలో అంత‌రాష్ట్ర ప్ర‌యాణానికి పోలీస్ శాఖ జారీచేసే ఈ-పాస్ త‌ప్ప‌నిస‌రి అని డీజీపీ మ‌హేంద‌ర్‌ రెడ్డి స్పష్టం చేశారు. 
 
ముఖ్యంగా, ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి, అంతర్ జిల్లాకు ప్రయాణించేవారికి అదేవిధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించే వారికి కూడా ఇది వర్తిస్తుంద‌న్నారు.
 
పాస్ తీసుకోవాలనుకునే వారు https://policeportal.tspolice.gov.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల‌ని తెలిపారు. పోలీసు కమిషనర్లు, సంబంధిత పోలీసు సూపరింటెండెంట్లు ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి పాస్‌ జారీ చేస్తారన్నారు. 
 
విమానాలు, రైళ్ల ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు వ్యాలీడ్ టికెట్ల‌ను వెంట‌తీసుకువెళ్లాల‌న్నారు. ఇత‌ర రాష్ట్రాల నుండి తెలంగాణ‌కు వ‌చ్చే వారు కూడా సంబంధిత రాష్ట్రాల అధికారులు జారీ చేసే పాస్‌ల‌ను క‌లిగి ఉండాలని పేర్కొన్నారు.
 
మరోవైపు, ప్రభుత్వం బుధవారం నుంచి 10రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మందుబాబులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్‌షాపుల ఎదుట మంగళవారం సాయంత్రం బారులు తీరారు. 10 రోజులేనా ఆ తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించవచ్చనే సందేహంతో ఒక్కొక్కరు మూడు, నాలుగు మద్యం బాటిళ్లను చంకనేసుకుపోతున్నారు. 
 
కొందరైతే బీరు కార్టన్లను తీసుకెళ్తున్నారు. బెల్టుషాపుల యజమానులు మాత్రం కార్టన్లకొద్దీ బీర్లు, విస్కీలు, చీప్‌లిక్కర్లు రేటు సపరేటైనా ఎగబడి తీసుకెళ్తున్నారు. లాక్‌డౌన్‌లో వైన్‌షాపులు మూసి వేస్తారని మందుబాబులు తప్పనిసరిగా బెల్టుషాపులను ఆశ్రయించకతప్పదు.