సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (18:47 IST)

తెలంగాణాలో 20 లక్షల దొంగ ఓట్లు తొలగిస్తే.. ఇక ఏపీలో ఎన్ని లక్షలు ఉంటాయో?

rajiv kumar
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఈసీ బృందం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ క్రమంలో 2022-23లో 22 లక్షలకుపైగా దొంగ ఓట్లను తొలగించినట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఆయన ఇతర కమిషనర్లతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. 
 
'తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభపరిణామం. సమాజంలోని అన్ని వర్గాలను ఓటింగులో భాగస్వామ్యం చేస్తున్నాం. యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసనీయం. రాష్ట్రంలో 2022 - 23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించాం. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదు. ఫామ్ అందిన తర్వాతే తొలగించామని తెలిపారు. 
 
అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యాం. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయి. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరగొచ్చని కొన్ని పార్టీలు ఆందోళన చెందాయి. బుధవారం ఓటర్ల తుది జాబితా కూడా జులై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించాం. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. 
 
అలాగే, 18 - 19 ఏళ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 35,356 ఉండగా.. ఒక్కో పోలింగ్ స్టేషనులో సగటు ఓటర్ల సంఖ్య 897గా ఉంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం సీ విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్టు రాజీవ్ కుమార్ తెలిపారు. 
 
ఇదిలావుంటే, ఏపీలో దొంగ నోట్లను అధికార వైకాపా నేతలు భారీగా నమోదు చేయించారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పైగా, అధికారుల తనిఖీల్లో కూడా భారీగా నకిలీ ఓటర్లు బయటపడుతున్నారు. జీరో నంబర్ ఇంటి నంబరుతో లక్షల సంఖ్యలో నకిలీ ఓటర్లు నమోదు చేశారు. ఈ బోగస్ ఓట్లు ప్రతి నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇపుడు తెలంగాణాలనే 22 లక్షల నకిలీ ఓట్లను తొలగిస్తే, ఇక ఏపీలో ఇంకెన్ని బోగస్ ఓట్లు ఉంటాయో వేచి చూడాల్సివుంది.