1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 మే 2021 (11:58 IST)

హత్యకు రెక్కీ .. అయినా భయపడలేదు.. 'సాగర్‌' గెలుపు కేసీఆర్‌ది కాదు : ఈటల

తనపై వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఏమాత్రం తప్పున్నా తనను శిక్షించాలన్నారు. ఉద్దేశ పూర్వకంగానే తనపై తప్పుడు రాతలు రాస్తున్నారని తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు విచారణ జరిగిందని ఈటల వ్యాఖ్యానించారు. 
 
అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులేనన్నారు. జమున హ్యాచరీస్‌లో తాను డైరెక్టర్‌ను కానన్నారు. ప్రభుత్వంలో ఒక కమిట్‌మెంట్‌తో పనిచేశానన్నారు. ఎప్పుడూ చిల్లర పనులు చేయలేదని ఈటల అన్నారు. సాగర్‌లో కేవలం కేసీఆర్ ప్రచారం వల్లే గెలవలేదన్నారు. కార్యకర్తలందరి సమిష్టి కృషి వల్లే పార్టీ గెలిచిందన్నారు. గులాబీ కండువా వేసుకున్న ప్రతి కార్యకర్తకు.. పార్టీకి ఓనర్ అనే ఫీలింగే ఉంటుందన్నారు. 
 
అదేసమయంలో కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు.
 
తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశానని ఈటల పేర్కొన్నారు. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానన్నారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదన్నారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు.
 
అదేసమయంలో పథకం ప్రకారమే తనపై కుట్ర జరిగిందని ఈటల అన్నారు. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారన్నారు. వేల కోట్లు సంపాధించానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారన్నారు. జమున హ్యాచరీస్‌తో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. తనకు సంబంధం లేని భూముల్లో సర్వే చేశారన్నారు. 
 
పైగా, 'నాపై వచ్చిన ఆరోపణలపై కనీసం నా వివరణ కూడా తీసుకోలేదు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే. సంబంధం లేని భూములను నాకు అంటగడుతున్నారు. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కాను. నయీం గ్యాంగ్ నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు. అప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతానా?' అని ఈటల ప్రశ్నించారు.