గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (15:58 IST)

పసుపు బోర్డు కంటే ప్రాంతీయ కార్యాలయం ముఖ్యమా? ఎంపీని ఆడుకున్న రైతులు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను ఆ నియోజకవర్గానికి చెందిన రైతులు ఓ ఆట ఆడుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదని నిలదీశారు. పైగా, పసుపు బోర్డు కంటే ప్రాంతీయ కార్యాలయం ముఖ్యమని ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను రైతులు తప్పుబట్టారు. 
 
నిజామాబాద్ జిల్లా చౌటుపల్లిలో శనివారం జరిగిన ఓ కార్యక్రమానికి అరవింద్ హాజరయ్యారు. ఎంపీ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న రైతులు.. అక్కడకు చేరుకుని గతంలో ఇచ్చిన హామీలపై నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
అంతేకాదు, ఎన్నికల సమయంలో అరవింద్ హామీలు ఇచ్చిన వీడియోలను కూడా రైతులు ఈ సందర్భంగా చూపించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మాట తప్పారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ ప్రసంగానికి రైతులు అడ్డుతగిలారు.
 
అంతకుముందు, బాల్కొండ పసుపు రైతులు కూడా అరవింద్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పసుపు బోర్డు కంటే ప్రాంతీయ కార్యాలయం ఉపయోగకరమైనదని అరవింద్ చెబుతున్నారని, ఇప్పుడాయన రాజీనామా చేసి అదే మాటతో ఎన్నికలకు వెళ్లి గెలవాలని రైతులు స్పష్టం చేశారు. 
 
కాగా, గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవితపై అరవింద్ పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ కె.కవిత ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ పసుపు రైతులే కావడం గమనార్హం.