ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (19:37 IST)

భాగ్యనగరిలో ముంచెత్తిన వర్షం - రోడ్లపై భారీగా నీరు.. స్తంభించిన ట్రాఫిక్

rain
హైదరాబాద్ నగరాన్ని మరోమారు భారీ వర్షం ముంచెత్తింది. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో భాగ్యనగరి రోడ్లపై భారీగా నీరు నిలిచింది. ఫలితంగా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకునిపోయాయి. 
 
హైదరాబాద్ నగరంపై వరుణుడు మరోమారు ప్రభావం చూపించడంతో మంగళవారం కుంభవృష్టి కురిసింది. ప్రధానంగా అబిడ్స్, సుల్తాన్ బజార్, నాంపల్లి, నారాయణగూడ, సికింద్రాబాద్, కోఠి, బోయిన్ పల్లి, బేగంపేట్, చిలకలగూడ, ఆల్వాల్, మాసాబ్ ట్యాంకు, మెహదీపట్నం, హైదర్ గూడ, ప్యాట్నీ సెటర్, హిమాయత్ నగర్, ప్యారడైజ్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
 
ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు కష్టాలు తప్పలేదు. ఎప్పటిలాగానే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ వర్షపు నీటిని తొలగించే పనులు ప్రారంభించింది. అత్యవసరం అయితే తప్ప నగర వాసులు రోడ్లపైకి రావొద్దని సూచన చేసింది.