ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (18:48 IST)

రాసిపెట్టుకోండి... 2024లో అదికారం మాదే : అమిత్ షా జోస్యం

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 2024 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించారు. మజ్లీస్‌ పార్టీకి బీజేపీ పార్టీ అస్సలు భయపడదని… తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు అని అమిత్‌ షా తెలిపారు.
 
సెప్టెంబరు 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రతి యేడాది నిర్వహిస్తూ వస్తున్న విషయం తెల్సిందే. దీన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్మల్‌లో శుక్రవారం భారీ బహిరంగ సభను నిర్వహించారు.
 
ఇందులో హోం మంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తూ, సర్దార్‌ పటేల్‌ సైనిక చర్య కారణంగానే తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ లభించిందని అన్నారు. నిజాం రాక్షస పాలను నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగిన రోజు సెప్టెంబర్‌ 17వ తేదీ అని ఆయన పేర్కొన్నారు. 
 
సెప్టెంబర్‌ 17వ తేదీని.. విమోచన దినోత్సవంగా నిర్వహించాలని అప్పట్లో సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారని… మరి ఇప్పుడు కేసీఆర్‌ డిమాండ్‌ ఏమైందని అమిత్ షా నిలదీశారు. కేసీఆర్‌… విమోచన దినాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఎవరికీ భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 
అలాగే, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నేతలు తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాదు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ, ప్రతి ఒక్క బస్తీలోనూ విమోచన దినోత్సవ వేడుకలను అధికారంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
 
అసలు, ఎంఐఎం పార్టీకి కేసీఆర్ కుటుంబం ఎందుకు జీ హుజూర్, సలాం అంటోందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం మోచేతినీళ్లు తాగుతూ కేసీఆర్ గత ఏడేళ్లుగా విమోచన దినోత్సవాన్నే మరిచారని విమర్శించారు.