బీఫ్ ఫెస్టివల్ : తెలంగాణాలో బీజేపీ ఎమ్మెల్యేకు జైలుశిక్ష
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభ్యుడు రాజాసింగ్‌కు స్థానిక నాంపల్లి ప్రత్యేక కోర్టు ఒకయేడాది జైలుశిక్ష విధించింది. ఈ శిక్ష 2015లో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ (పెద్దకూర పండుగ) వివాదంలో విధించింది.
గత 2015లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. దీనిపై ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే తన విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు. దాద్రీ తరహా ఘటనలు పునరావృతం అవుతాయన్నారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలతో రాద్ధాంతం చేస్తూ పోలీసులను కూడా బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై సెక్షన్ 295-ఏ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది.
ఈ కేసు ఐదేళ్ల పాటు విచారణ సాగగా, శుక్రవారం నాంపల్లి కోర్టు రాజా సింగ్‌కు జైలు శిక్ష విధించింది. అనంతరం ఆయన బెయిల్‌కు దరఖాస్తు చేయగా, న్యాయస్థానం అందుకు సమ్మతిస్తూ బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తానని రాజా సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.