బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (14:06 IST)

'గ్రేటర్' నేరేడ్‌మెట్‌లో తెరాస అభ్యర్థి విజయం.. బోరున విలపించిన భాజపా అభ్యర్థి!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా, నేరేడ్‌మెట్ డివిజన్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫలితం తాజాగా వెలువడింది. ఈ ఫలితంలో తెరాస అభ్యర్థి విజయం సాధించారు. దీంతో బీజేపీ అభ్యర్థి బోరున విలపించారు. 
 
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరేడ్‌మెట్ డివిజన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారని బుధవారం క్రితం రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 
 
రాష్ట్ర  సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపును ప్రారంభించిన అధికారులు, 782 ఓట్ల మెజారిటీతో మీనా గెలిచినట్టు స్పష్టంచేశారు. కాగా, ఇప్పటికే మీనా 504 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, కౌంటింగ్ నిలిపిన 544 ఓట్లు (స్వస్తిక్ కాకుండా ఇతర గుర్తులు బ్యాలెట్‌పై ఉన్నవి) ఈ ఉదయం లెక్కించారు.
 
కాగా, ఎన్నికల ఫలితం వెల్లడైన అనంతరం, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ బీజేపీ తరపున పోటీ చేసిన ప్రసన్న నాయుడు కన్నీటి పర్యంతం అయ్యారు. తొలి రౌండ్‌లో తిరస్కరించబడిన ఓట్లను రెండో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో కలిపారని, దీనిపై తాను న్యాయపోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు.
 
ఈ విషయంలో రిటర్నింగ్ అధికారి తనకు అన్యాయం చేశారని, మొదట తాను ప్రశ్నించినప్పుడు పొరపాటు జరిగిందని పేర్కొన్న ఆర్ఓ వీణ, ఆపై తనకు అన్యాయం చేస్తూ, 1,300 ఓట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై తాను కౌంటింగ్ జరిగిన రోజునే ఫిర్యాదు చేశానని తెలిపారు.
 
కాగా, ఈ నెల నాలుగో తేదీన వెల్లడైన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 150 డివిజన్లకుగాను తెరాస 57 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 46 చోట్, ఎంఐఎం 44 చోట్ల, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందారు. ఇపుడు తెరాసకు మరో సీటు ఖాయమైంది. దీంతో తెరాసకు మొత్తం 58 సీట్లు వచ్చినట్టయింది. అయితే, మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 76 సీట్లు వచ్చివుండాలి. ఇపుడు ఏ ఒక్క పార్టీకి అన్ని సీట్లు రాలేదు.