హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే ఛాన్స్: ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. శనివారం (జూలై 2) సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ ఉత్తర భాగంలోనే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగరవ్యాప్తంగా కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే.
జూన్‌లో నగరంలో 84.6 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. అప్పుడు సాధారణ వర్షపాతం 109.2 మి.మీగా నమోదైంది. రాబోయే రోజుల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 7.5 మి.మీ. నుంచి 15 మి.మీ. మధ్య వర్షపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టారు.