గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (12:58 IST)

హైదరాబాద్ మెట్రోపై కరోనా పంజా : భారీ నష్టాల్లో.. ఎల్ అండ్ టి ఆపన్నహస్తం

హైదరాబాద్ మెట్రో రైళ్లపై కరోనా పంజా పడింది. ఫలితంగా భారీ నష్టాలను చవిచూసింది. కోవిడ్ నిబంధనలు, లాక్ డౌన్లు, కరోనా నేపథ్యంలో ప్రయాణికులు తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం వంటి కారణాలు మెట్రో రైలును భారీ నష్టాల్లోకి తీసుకెళ్లాయి.
 
వాస్తవానికి హైదరాబాదులో మెట్రో రైలు ప్రారంభమైన తొలి రోజు నుంచే విపరీతమైన ప్రజాదరణ పొందింది. రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దాంతో తొలి సంవత్సరాలలో మంచి లాభాలనే సాధించింది. 
 
అయితే కరోనా రాకతో మెట్రో లాభాలు పట్టాలు తప్పాయి. ప్రతి రోజు సగటున రూ.5 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. ప్రతి రోజు కేవలం రూ.కోటి మాత్రమే ఆదాయం వస్తోందట.
 
ఈ నేపథ్యంలో ఇటీవల మెట్రో రైల్ నిర్వాహకులైన ఎల్ అండ్ టీ అధికారులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. నష్టాల్లో కూరుకుపోయిన మెట్రో రైల్‌ను ఆదుకోవాలని కోరారు. 
 
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మెట్రో రైల్ రూ. 400 కోట్ల నష్టాన్ని చవిచూసిందట. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నష్టాలు రూ. 1,500 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని మెట్రో రైల్ అధికారులు సీఎంని కోరారు.