మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (14:46 IST)

వృద్ధురాలి ప్రాణం తీసిన రూమ్ హీటర్!

చలిని తట్టుకోలేక గదిలో వెచ్చదనం కోసం ఏర్పాటు చేసుకున్న రూమ్ వాటర్ హీటర్ ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో హీటర్‌లో చేలరేగిన మంటలకు కదలలేని స్థితిలో మంచంపై పడుకున్న వృద్ధురాలు బలైంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేశవ డాలే అపార్ట్‌మెంట్స్‌ 101లో రిషేంద్ర వేలూరి తల్లి వి.నిర్మల(78)తో కలిసి నివాసం వుండే వారు. అతనికి ఇటీవల వివాహం జరగడంతో అదే అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో భార్యతో కలిసి ఉంటున్నాడు. తల్లి నిర్మల ఒక్కతే 101 ఫ్లాట్‌లో ఉంటోంది. ఆమెకు రెండు కాళ్లూ పని చేయకపోవడంతో ఒక పనిమనిషిని పెట్టుకున్నారు. 
 
చలి కాలం కావడంతో ఆమె పడుకునే మంచం పక్కనే వెచ్చదనం కోసం రూమ్‌ హీటర్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ అయి హీటర్‌లో మంటలు లేచాయి. పక్కనే ఉన్న మంచానికి మంటలు అంటుకున్నాయి. కదలలేని స్థితిలో మంచంపై పడుకున్న నిర్మలకు కూడా మంటలు అంటుకున్నాయి. 40 శాతం గాయాలయ్యాయి. 
 
ఆమె పడుకున్న మంచం సగం కాలిపోయింది. ఉదయం 10.40 గంటల ప్రాంతంలో పనిమనిషి రాణి నిర్మల ఉంటున్న ఫ్లాట్‌లోకి వెళ్ళింది. పొగ కనిపించడంతో అపార్ట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ రోహిత్‌కు, రిషేంద్ర భార్య అమూల్యకు సమాచారం అందించింది. 
 
వారు లోపలికి వెళ్ళిచూడగా నిర్మల అప్పటికే కాలిన గాయాలతో మృతి చెంది ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రిషేంద్ర ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.