తీవ్ర ఆందోళనలో హైదరాబాద్ ప్రజలు.. కేటీఆర్
డెంగ్యూ వ్యాధి పట్ల హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వాటి అమలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు కేటీఆర్ తెలిపారు.
జీహెచ్ఎంసీలో సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రయత్నించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఆరు జోన్లకు సంబంధించి అధికారులు అంతా ఉదయాన్నే గ్రామాల్లో పర్యటించాలని కేటీఆర్ ఆదేశించారు.
మంగళవారం నుంచి వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి తాను హైదరాబాద్ లో పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇండ్లలో నీరు నిలువ లేకుండా చూడాలని కోరారు. మెడికల్ క్యాంపులు సైతం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈనెల 15, 16లోపు నగరంలో ఉన్న చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు కేటీఆర్ తెలిపారు. 25 మెడికల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. బస్తీ దవాఖానాల్లో సాయంత్రమే ఓపీ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.